Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలలో కొనసాగుతున్నప్పుడే.. మూడు ప్రాజెక్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘకాల శ్రమ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తాను ప్రకటించిన మూడు ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే.. 2021లో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసి.. జూలై 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేశారు. అటు ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఓజీ (OG) సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..
మరోవైపు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్లో వేగంగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. అందులో భాగంగానే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పుడు మొదలైంది. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ హరీష్ శంకర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.
మాట ఇస్తే నిలబెట్టుకోవడం నీ తర్వాతే ఎవరైనా – హరీష్ శంకర్
అసలు విషయంలోకి వెళ్తే.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ.. “ఒకసారి మాట ఇస్తే.. నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం, మీరు పక్కనుంటే.. కరెంటు పాకినట్టే” అంటూ ఒక డైలాగ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. మాట ఇస్తే నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా.. ఈరోజు నుంచి సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని తెలిసి అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భగత్ సింగ్ సినిమా విశేషాలు..
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా (Rashi Khanna), శ్రీ లీల(Sreeleela ) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరగానే షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలి అని డైరెక్టర్, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘హరిహర వీరమల్లు 2’ షూటింగ్ కూడా పూర్తిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
https://twitter.com/harish2you/status/1952444120011522382
ALSO READ: Actress Arrest: పరారీలోనే మూడేళ్లు.. హీరోయిన్‌ను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు