Jana Nayagan Release Date:భారత ఎన్నికల సంఘం తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్ నటిస్తున్న చివరి సినిమా జనా నాయగన్ విడుదల తేదీపై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా విడుదల కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు సినిమా నిర్మాతలు కూడా విడుదల తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అలా ఎందుకు అంటే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ TVK ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఒకవేళ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రాకపోతే, సినిమా మీద ఉన్న అంచనాలు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఫలితాలు రాకముందే సినిమాను విడుదల చేస్తే మంచి ఓపెనింగ్స్ రావచ్చని వారి అభిప్రాయం.
అయితే ప్రస్తుతం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ట్రేడ్ ట్రాకర్లు చెబుతున్న ప్రకారం, ఏప్రిల్ 30న విడుదల చేయాలంటే రెండు వారాల్లో సెన్సార్ పూర్తవ్వాలి. అలాగే సినిమా ప్రమోషన్లు కూడా త్వరగా ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదని కూడా కొంతమంది చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, నటుడు ధనుష్ నటిస్తున్న ‘కారా’ సినిమా ఇప్పటికే ఏప్రిల్ 30 రిలీజ్‌గా ప్రకటించారు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ‘జనా నాయకన్’ టీమ్ త్వరగా తమ విడుదల తేదీ ప్రకటిస్తే మంచిదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇప్పటివరకు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలే. ‘జనా నాయగన్’ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.