Anju Kurian:సాధారణంగా సినీ తారలు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొద్ది నెలల్లోనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ, ఓ సౌత్ హీరోయిన్ మాత్రం నిశ్చితార్థం జరిగిన ఏకంగా రెండేళ్ల తర్వాత తన ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజూ కురియన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.
ప్రముఖ వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్‌ను అంజూ కురియన్ వివాహం చేసుకుంది. కేరళలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి చాలా అందంగా జరిగింది. పెళ్లి కూతురు గెటప్‌లో అంజూ చాలా క్లాసీగా కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను స్వయంగా అంజూనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నిజానికి 2024 అక్టోబర్‌లోనే అంజూ, రోషన్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
also read:సమంతకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన కంటెస్టెంట్.. క్రేజీ రియాక్షన్ వైరల్!
కేరళలోని కొట్టాయానికి చెందిన అంజూ కురియన్, చెన్నైలో ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసింది. సినిమాల్లోకి రాకముందు ఓ సంస్థలో రెండేళ్ల పాటు ఉద్యోగం కూడా చేసింది. నటనపై ఇష్టంతో మోడలింగ్ వైపు అడుగులు వేసి, 2013లో మలయాళ సూపర్ హిట్ ‘నేరమ్’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ప్రేమమ్’, ‘ఓం శాంతి ఓషానా’, ‘నాన్ ప్రకాశన్’, ‘అబ్రహం ఓస్లర్’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో 2018లో వచ్చిన ‘ఇదం జగత్’ సినిమాలో సుమంత్ సరసన హీరోయిన్‌గా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది అంజూ. ఇటీవల ‘ఓహో ఎంతన్ బేబీ’, ‘అదర్స్’, ‘ఇదయం మురళి’ వంటి సినిమాల్లోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అంజూ కురియన్, పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. కొత్త జీవితం ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.