Kargil Vijay Diwas : ప్రతి సంవత్సరం జులై 26న భారతదేశం కార్గిల్ విజయ్ దివాస్‌ను జరుపుకుంటుంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాకిస్తాన్ దళాలను ఓడించి, జమ్మూ-కాశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లోని కీలక స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన సైనికుల ధైర్యం, త్యాగాన్ని గౌరవించేందుకు, ఈ విజయాన్ని కార్గిల్ విజయ్ దివాస్ గా ఈ రోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా నేడు కార్గిల్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన బెస్ట్ వార్ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
1. శేర్‌షా (Shershaah)(2021)
ఈ బయోగ్రాఫికల్ వార్ డ్రామా కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆయన కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. అందుకుగాను అతనిని ప్రభుత్వం పరం వీర్ చక్రతో సత్కరించింది. ఇందులో విక్రమ్ బత్రా పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించగా, కియారా అద్వానీ విక్రమ్ ప్రియురాలు డింపుల్ పాత్రలో నటించింది. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కెప్టెన్ బత్రా బాల్యం, సైన్యంలో చేరడం, పాయింట్ 4875, 5140 వంటి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో అతని పాత్ర, చివరకు యుద్ధంలో గాయపడిన తన సహచరుడిని కాపాడుతూ1999లో చేసిన విక్రమ్ త్యాగాన్ని చుపిస్తుంది. ఈ సినిమాలో విక్రమ్, డింపుల్ ప్రేమ కథ కూడా హార్ట్ టచ్ అవుతుంది. Amazon Prime Videoలో రిలీజ్ అయిన ఈ సినిమా, 2021లో అత్యధిక వ్యూస్ వచ్చిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ ను కూడా గెలుచుకుంది. IMDbలో ఈ సినిమాకి 8.3/10 రేటింగ్ ఉంది.
2. LOC కార్గిల్ (LOC Kargil) (2003)
JP దత్తా దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ వార్ డ్రామా, 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయ్ ఆధారంగా తెరకెక్కింది. 255 నిమిషాల రన్‌టైమ్‌తో (4 గంటలకు పైగా), ఇది భారతదేశంలో ఎక్కువ రన్‌టైమ్ ఉన్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. సంజయ్ దత్, అజయ్ దేవ్‌గణ్, సైఫ్ అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, మనోజ్ బాజ్‌పాయీ, నాగార్జున వంటి స్టార్ కాస్ట్‌తో, ఈ సినిమా రాజపుతానా రైఫిల్స్, సిఖ్ రెజిమెంట్, గోర్ఖా రైఫిల్స్ వంటి బెటాలియన్‌ల సైనికుల కథలను చూపిస్తుంది. టైగర్ హిల్, పాయింట్ 4875, 5140 వంటి స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకునే యుద్ధ సన్నివేశాలతో పాటు, సైనికుల వ్యక్తిగత జీవితాలు, వారి కుటుంబాలతో ఉన్న బంధాలను కూడా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా యుద్ధభూమిలోని కఠినమైన పరిస్థితులను, సైనికుల త్యాగాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
3. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ (Gunjan Saxena: The Kargil Girl (2020)
శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ సినిమా, భారత వైమానిక దళంలో మొదటి మహిళా పైలట్‌లలో ఒకరైన లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. జాన్వీ కపూర్ గుంజన్ పాత్రలో నటించగా, పంకజ్ త్రిపాఠీ, అంగద్ బేడీ సహాయక పాత్రలలో నటించారు. 1996లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిన గుంజన్, కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులను రక్షించడం, శత్రు స్థానాలను మ్యాప్ చేయడం వంటి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఆమె బాల్యం, పైలట్ శిక్షణలో ఎదురైన ఆటుపోట్లు, కార్గిల్ యుద్ధంలో ఆమె పోరాట పటిమను చూపిస్తుంది. ఆమె సాహసానికి ప్రభుత్వం షౌర్య వీర్ అవార్డ్ తో సత్కరించింది. Netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ మూడు సినిమాలు కార్గిల్ యుద్ధంలోని విభిన్న పాత్రలను చూపిస్తాయి. ఈ చిత్రాలు కేవలం యుద్ధ సన్నివేశాలను మాత్రమే కాకుండా, సైనికుల వ్యక్తిగత త్యాగాలు, కుటుంబ బంధాలు, దేశభక్తిని కూడా ఎమోషనల్‌గా చూపిస్తాయి.
Read Also : సైనికులకు చేతబడి చేసి చంపే సైకో… నిద్రలోనూ కలవరించే హర్రర్ సీన్స్