Kingdom Film: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కింగ్డమ్(Kingdom). జులై 31వ తేదీ విడుదలైన ఈ సినిమా తెలుగులో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే తమిళంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఈ సినిమాలో తమిళ ప్రజలను విలన్లుగా చిత్రీకరించి చూపించారు అంటూ తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమిళంలో ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించి చిత్ర బృందం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురుగన్ పేరును విలన్ కు పెట్టడం ఏంటీ?
ఇలా తమిళ ప్రజలు అంటే అంత చిన్న చూపా, అంటూ తమిళ జాతీయవాద సంస్థ నామ్ తమిళర్ కట్చి (NTK) చిత్ర బృందంపై మండిపడ్డారు. అదేవిధంగా తమిళనాట ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే దేవుడి పేరు మురుగన్(Murugan) అలాంటి దేవుడి పేరును విలన్ పాత్రకు పెట్టడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కింగ్డమ్ నిర్మాణ సంస్థ స్పందించి అసలు విషయాన్ని తెలియజేస్తూ తమిళ ప్రజలకు క్షమాపణలు కూడా తెలియజేసింది.
బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు…
కింగ్డమ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధికారికంగా ఈ విషయంపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. తమ సినిమా ద్వారా ఎవరిని బాధ పెట్టడం తమ ఉద్దేశం కాదని తెలియజేశారు. మా సినిమా ద్వారా ఎవరైనా బాధపడిన, ఎవరి మనోభావాలను దెబ్బ తీసి ఉంటే అందుకు మేము క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. మా సినిమాలోని పాత్రలన్నీ కేవలం కల్పితం మాత్రమేనని ఎవరిని ఉద్దేశించి ఈ సినిమా చేయలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాకు తమిళ ప్రజలపై ఎంతో గౌరవం ఉందని, మేము కూడా వారిని గౌరవిస్తాము అంటూ క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎట్టకేలకు హిట్ కొట్టిన విజయ్…
ఇలా తమిళనాడులో ఈ సినిమా పట్ల వ్యక్తం అవుతున్న విమర్శలపై చిత్ర బృందం స్పందిస్తూ క్షమాపణలు కోరడంతో ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడినట్టు అయ్యిందని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ సినిమాలు లేక ఎంతో సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలోనే కింగ్డమ్ సినిమా ఈయనకు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యారు. అదేవిధంగా రవికిరణ్ కోలా డైరెక్షన్ లో మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Vijay Devarakonda: బెట్టింగ్ యాప్ విచారణ… నేను చేసింది కరెక్ట్ అంటున్న విజయ్ దేవరకొండ