Uttarkashi Cloudburst: ప్రకృతి సృష్టి మాత్రమే కాదు… అవసరమైతే విధ్వంసమూ చేయగలదని మరోసారి రుజువైంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా విపత్తులు వస్తాయో మనిషికి ముందుగా అంచనా వేయడం అసాధ్యం. అలాంటి ఒక్క విషాదకర ఘటన ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో సంభవించింది. భారీ వర్షాలు, అకస్మాత్తుగా సంభవించిన మేఘవిష్ఫోటనం, దాంతో వచ్చిన వరదలు… ఇవన్నీ కలసి ఒక భారీ ప్రకృతి విపత్తుని రేపాయి. ఈ విపత్తులో కేరళ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరిన 28 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.
వారి ఆచూకీ ఇంకా తెలియకపోవడం, మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడం… దాంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ యాత్ర మార్గం అంతా మట్టి, మురుగు, శిథిలాలతో నిండిపోయి భయానకంగా మారిపోయింది.
కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం – ఈ పర్యాటక బృందం బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఉత్తర్‌కాశి నుంచి గంగోత్రికి బయలుదేరింది. అదే మార్గంలో అకాల వర్షాలు కురవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది
ఈ 28 మందిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన కేరళవాసులు కాగా, మిగతా 8 మంది కేరళలోని ఇతర జిల్లాల నుంచి వచ్చినవారే. అందులో ఓ కుటుంబం మంగళవారం చివరి సారిగా ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ..“మేము ఇప్పుడు గంగోత్రిని వదిలి బయలుదేరుతున్నాం” అని వారు చెప్పినట్టు తెలిపారు.
ఆ సంఘటన తరవాత మళ్ళీ వారు ఫోన్, మెసేజ్, వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ జరగలేదు. వారికీ టూర్ ఏర్పాట్లు చేసిన హరిద్వార్ ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ కూడా ఏ సమాచారం ఇవ్వలేకపోతుంది. “అక్కడ నెట్‌వర్క్ లేదు, ఫోన్లు బ్యాటరీ అయిపోయి ఉండొచ్చు” అని కుటుంబ సభ్యులు ఆందోళనతో తెలిపారు.
ఇక అదే సమయంలో ధరాలి ప్రాంతం సగం వరకు మట్టితో నిండిపోయింది. ఇప్పటివరకు కనీసం 4 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. గంగోత్రి యాత్ర మార్గంలో ప్రధానమైన ఈ స్థలం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ ఇప్పుడు అతి దారుణమైన పరిస్థితుల్లో ఉంది.
ఇక మరోవైపు, ఖీర్ గంగా నదిలో వచ్చిన వరదల వల్ల భారత సైన్యంలో 9 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ 150 మందితో కూడిన రెస్క్యూ బృందం – కల్నల్ హర్షవర్ధన్ నేతృత్వంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.