Kota Srinivas Rao Death: కోటా శ్రీనివాసరావు చాలా రోజులుగా మీడియాలో కనిపించలేదు. నెలరోజుల క్రితం నిర్మాత బండ్లగణేశ్ కోటా ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కోటాతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కోటాను చూసి అభిమానులు షాక్ అయ్యారు. పూర్తిగా సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. డయాబెటిస్ కారణంగా కోటా కాలి వేలని తొలిగించినట్లు తెలిసింది.
సిల్వర్ స్క్రీన్ మీద విలన్‌గా దడ పుట్టిస్తాడు. తన మాటలు, తన కామెడీ టైమింగ్‌తో అందర్నీ నవ్విస్తాడు. మిడిల్ క్లాస్ తండ్రిగా.. అల్లరి తాతయ్యగా, అవినీతి లీడర్‌గా.. హత్యలు చేసే రౌడీగా.. కామెడీ విలన్‌గా.. ఇలా ఒకటా రెండా.. ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. వెండి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు కొన్ని పాత్రలు ఆయన తప్పితే మరెవరూ చేయలేరు అనేంతగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.
తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. తెలుగునాట ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాస్ రావు భర్తీ చేశారనడం అతిశయోక్తి కాదు. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కోట శ్రీనివాస్ రావుకు అభిమానులు కూడా ఎక్కువే. అలాంటి విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల కోట.. ఈ ఉదయం అస్వథతతో కన్ను మూశారు. కోట మృతికి తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కోటా భౌతిక కాయాన్ని ఉంచారు.
సీరియస్ విలన్ గా … కామెడీ టచ్ తో కూడిన విలన్ గా .. కార్పొరేట్ విలన్ గా .. విలేజ్ స్థాయి విలన్ గా ఇలా విలనిజంలో కోట శ్రీనివాసరావు తన విశ్వరూపం చూపించారు. రంగస్థలంపై తనకి గల అపారమైన అనుభవంతో ఆయన ప్రేక్షకులను కట్టిపడేశారు. విలనిజాన్ని కొత్తదనం దారుల్లో .. కొత్త తరం తీరాల్లో పరుగులు తీయించారు. ఆయన వంట్లో ఓపిక తగ్గేవరకూ ఆయనలోని విలనిజాన్ని ఎవరూ ఎదుర్కోలేపోయారు .. మరే విలన్ కూడా ఆయన దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. అందువల్లనే ‘పద్మశ్రీ’ పురస్కారం ఆయనను అలంకరించింది.
తెలుగు తెరకి మున్ముందు చాలామంది ప్రతినాయకులు పరిచయం కావొచ్చు. కోట ప్రభావం వాళ్లపై పడవలసిందే తప్ప, వాళ్ల ప్రతిభ కోటను మరిచిపోయేలా ఎప్పటికీ చేయలేదు. ఎందుకంటే ఇంతకాలం పాటు.. ఇన్ని విలక్షణమైన విలన్ పాత్రలు మరొకరికి దక్కే అవకాశాలు లేవు .. రావు. అందుకే విలన్లు ఎందరు వచ్చినా కోట ఒక్కడే .. కోట అంటే కోటికి ఒక్కడే.
సినిమా పరిశ్రమలో కోట శ్రీనివాసరావుకు మించిన ఆల్ రౌండ్ యాక్టర్ లేరంటే అతియోశక్తి కాదు. డైలాగ్ డెలివరీలో కోట తనదైన మార్కు చూపించేవారు. నటనంటే కోటకు అమితమైన ఇష్టం. చనిపోయే వరకు నటించాలన్నది కోటశ్రీనివాసరావు . వయసు సహకరించిన ఉన్నంత వరకు కోటా సినిమాల్లో పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.
Also Read: కోటా వల్లే బెజవాడలో ఆ పార్టీ జెండా రెపరెపలు.. రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు?
కామెడీ అయినా, విలనిజమైనా , క్యారెక్టర్ అర్టిస్ట్ అయినా కోట ఎంటర్ అయ్యారంటే వందకు వందశాతం న్యాయం చేసే నటుడు కోట శ్రీనివాసరావు.