Manchu Manoj: మంచు వారి వారసుడు మంచు మనోజ్ ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నాడు. మిరాయ్ లో మహాబీర్ లామాగా అతడి నటనకు ఫిదా కానీ వారుండరు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు హీరో అంటే అతడే. తేజ సజ్జా కన్నా మనోజ్ కే ఎక్కువ పేరు వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. మంచు మనోజ్ ఇంత సక్సెస్ ను చాలా కాలం తరువాత చూస్తున్నాడు. అదే విషయాన్నీ అన్ని వేదికలపై కూడా చెప్పుకొచ్చాడు. అందరికంటే ఎక్కువ ఈ సినిమా సక్సెస్ అయ్యినందుకు మనోజ్ నే ఎక్కువ సంతోషంగా ఉండాలి. కానీ, మనోజ్ లో అది లేదు.
సినిమా సక్సెస్ అయ్యినందుకు, పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా కూడా పూర్తిగా ఈ సినిమాలో తనను భాగం చేయలేదనే బాధ ఆయనలో కనిపిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు. సినిమా సక్సెస్ కు అతిపెద్ద కారణం ప్రమోషన్స్. అందులో సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ పాల్గొంటాయి. హీరో, హీరోయిన్, డైరెక్టర్, విలన్.. ఇలా కీలక పాత్రలు అన్ని రాష్ట్రాలు తిరిగి తమ సినిమా గురించి చెప్పి థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పిస్తాయి. మిరాయ్ విషయంలో కూడా ఇది జరిగింది. కానీ, ఇందులో మనోజ్ మాత్రం లేడు.
మొదటి నుంచి కూడా మిరాయ్ ప్రమోషన్ బాధ్యతలను తేజ ఒక్కటే తన భుజాలపై మోశాడు. ఎక్కడకు వెళ్లినా ఒంటరిగానే కనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో మనోజ్ ను వదిలేసి.. మిగతా అన్నిచోట్లకు తేజ వెళ్ళాడు. బాలీవుడ్ కపిల్ షోకు తేజ, శ్రీయ, జగపతి బాబు వెళ్లారు కానీ, మనోజ్ ను తీసుకెళ్లలేదు. మిగతా చోట్లకు తేజ వెళ్ళాడు. ఇదే విషయాన్నీ మనోజ్ ఇన్ డైరెక్ట్ గా ఎన్నోసార్లు ప్రెస్ ముందు చెప్పుకొచ్చాడు.
తమ్ముడు తేజ సినిమా కోసం కష్టపడ్డాడు, బాగా ప్రమోట్ చేశాడు, నన్ను మాత్రం పిలవలేదు. అయితే ఈ గ్యాప్ లో నేను డబ్బింగ్ పూర్తి చేసుకున్నాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. మొన్నటికి మొన్న థాంక్స్ మీట్ లో కూడా మా టీమ్ ప్రమోషన్స్ కు నన్ను పిలవలేదు అని ముఖం మీదనే చెప్పుకొచ్చాడు. ఎంత హీరో వెళ్లినా.. తాము కూడా ఉంటే ఇంకా బావుండేది అనే ఫీల్ ఎవరికైనా ఉంటుంది అనేది మనోజ్ వాదన.
అయితే తేజ మరియు మేకర్స్ వేరే స్ట్రాటజీని వాడి సినిమాను ప్రమోట్ చేశారు అని తెలుస్తోంది. ఈ మధ్య హీరోలు ఒక్కరే తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. వారి బాటలోనే తేజ కూడా ఒక్కడే ప్రమోట్ చేసాడు. ఏదిఏమైనా మనోజ్ ని కూడా ప్రమోషన్స్ లో చేరిస్తే.. మిగతా ఇండస్ట్రీలకు తాను కూడా పరిచయం అయ్యేవాడు. మరి ముందు ముందు మనోజ్ తన సినిమా ప్రమోషన్స్ లో ముందు ఉంటాడేమో చూడాలి.