Balakrishna: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా వర్సెస్ నందమూరి (Mega Vs Nandamuri)అనే వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలలో భాగంగా చిరంజీవి(Chiranjeevi) గురించి వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్రదుమారం రేపడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చలకు కూడా కారణం అయ్యాయి. ఇలా అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి చేస్తున్న వ్యాఖ్యలపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత బాలకృష్ణ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ నిరసనలు తెలియచేయడమే కాకుండా బాలకృష్ణ గారు చిరంజీవికి బహిరంగంగా క్షమాపణలు(Apologies) చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ తనని తాను అతీత శక్తిగా భావించుకుంటూ మెగా కుటుంబం పై గతంలో కూడా ఎన్నోసార్లు అవమానకరంగా మాట్లాడారు. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే చిరంజీవి గారు ఎప్పుడు కూడా వీటిపై స్పందించలేదు. తద్వారా అభిమానులుగా మేము కూడా మౌనం పాటించాము. గతంలో బాలకృష్ణ గారి కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలుకు వెళ్లినప్పుడు, నందమూరి కుటుంబం అధికారంలోకి రావడానికి కృషి చేసింది మెగా కుటుంబం అనే విషయాన్ని బాలకృష్ణ మరిచిపోయారు.
అధికార మదం తలకి ఎక్కించుకున్న బాలకృష్ణ గారు చట్టసభలలో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజారుస్తూ మాట్లాడారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చిరంజీవి గారిని కూడా ఎంతో బాధపెట్టాయని ఆయన స్పందించిన విధానం చూస్తేనే అర్థమవుతుంది. మెగా కుటుంబం అండగా లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలని మెగా అభిమానులు హితువు పలుకుతున్నారు. అలాగే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం..
చిరంజీవి అభిమానులుగా మేము బాలకృష్ణ తీరును వ్యతిరేకిస్తున్నామని ఈ ఘటనపై వెంటనే బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇలా చిరంజీవికి క్షమాపణలు చెప్పని ఎడల బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే పలుచోట్ల మెగా అభిమానులు నిరసనలు తెలియజేస్తూ బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిలభారత చిరంజీవి యువత నుంచి కూడా బాలకృష్ణకు ఇలాంటి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బాలయ్య స్పందిస్తారా? ఆయన మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే మెగా నందమూరి కుటుంబాల మధ్య ఇలాంటి గొడుగులు జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఎన్నో సందర్భాలలో వీరి మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది.
Also Read: Sujeeth: పవన్ కంటే ముందు ఆ మెగా హీరోని లైన్ లో పెట్టిన సుజీత్…కథ కూడా సిద్ధం కానీ?