Neetu Kapoor: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆదర్శవంతమైన జంటలలో రిషి కపూర్, నీతూ కపూర్ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అన్యోన్యంగా సాగిన వీరి బంధం, 2020లో రిషి కపూర్ మరణంతో ఒక్కసారిగా ముగిసిపోయింది. ఈ విషాదం నీతూ కపూర్‌ను మానసికగా ఎంతలా కుంగదీసిందో ఆమె ఇటీవల పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
రిషి కపూర్ మరణించిన తర్వాత నీతూ కపూర్ జీవితం ఒక్కసారిగా శూన్యమైంది. తన జీవితమంతా భర్త చుట్టూనే తిరిగిన ఆమెకు, ఆయన లేని లోటు భరించలేనంతగా మారింది. ఆ సమయంలో ఆమె తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడ్డారు. భర్త జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో రాత్రుళ్లు గడపడం ఆమెకు నరకప్రాయంగా మారింది.
ఈ మానసిక వేదన నుండి తాత్కాలికంగానైనా ఉపశమనం పొందడానికి ఆమె తప్పుడు మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నారు. మనసును మొద్దుబార్చుకోవడానికి ఆమె ప్రతిరోజూ మద్యం సేవించడం ప్రారంభించారు. మద్యం తాగితే తప్ప ఆమెకు నిద్ర పట్టేది కాదు. ఒకానొక దశలో మద్యం కూడా ఆమె బాధను తగ్గించలేకపోయింది. దీంతో మానసిక ప్రశాంతత కోసం, బలవంతంగా నిద్రపోవడానికి ఆమె వైద్యుల సలహాతో సెడెటివ్ ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించారు. అది లేకుండా ఆమె కనీసం కళ్లు కూడా మూయలేని స్థితికి చేరుకున్నారు.
Read also-M4M రివ్యూ: పెయింటింగ్స్ తరహాలో హత్యలు.. ఈ మిస్టరీ థ్రిల్లర్ మెప్పించిందా?
తన పరిస్థితిని గమనించిన నీతూ కపూర్, ఇలాగే ఉంటే తాను మానసికంగా పూర్తిగా దెబ్బతింటానని గ్రహించారు. ఆ ఊబిలో నుండి బయటపడటానికి ఆమె కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన కుమారుడు రణబీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఆమెకు కొండంత అండగా నిలిచారు. ఆమె ఒంటరిగా ఉండకుండా వారు జాగ్రత్త పడ్డారు. ఖాళీగా ఉంటే జ్ఞాపకాలు మరింత వేధిస్తాయని భావించి, ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. ‘జుగ్ జుగ్ జీయో’ వంటి సినిమాలతో, రియాలిటీ షోలతో బిజీ అయ్యారు. పని తనను డిప్రెషన్ నుండి కాపాడిందని ఆమె చెబుతుంటారు. మానసిక వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఆమె తన వ్యసనాల నుండి మరియు బాధ నుండి క్రమంగా బయటపడ్డారు.