Tollywood: ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు తమ అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన జంటలు.. మళ్లీ అదే తెరపై ప్రత్యర్ధులుగా కనపడితే అభిమానులు తట్టుకుంటారా?.. ముఖ్యంగా ఎన్నో ఆన్ స్క్రీన్ జంటలు తమ అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోగా..ఇప్పుడు దర్శకులు ట్రెండ్ మారుస్తూ అదే సెలబ్రిటీ జంటల మధ్య శత్రుత్వాన్ని పెంచేసి ఆ జంటను కొత్తగా చూపిస్తున్నారు. ప్రత్యర్ధులుగా మారిన ఆ జంటలు ఏ మేరకు మెప్పిస్తాయో తెలియదు కానీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైన ఈ కొత్త ట్రెండ్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇప్పటికే శ్రీవల్లి పాత్రలో పుష్ప సినిమాలో పుష్ప రాజ్ భార్యగా అందరి దృష్టిని ఆకట్టుకుంది రష్మిక మందన్న. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న , అల్లు అర్జున్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. జంట అంటే ఇలా ఉండాలి అని అందరి చేత ప్రశంసలు పొందారు. అయితే అలాంటి ఈ జంట మధ్య శత్రుత్వాన్ని పెంచుతూ తెరపై కొత్తగా అట్లీ ఆవిష్కరిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను ఎంపిక చేయగా.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన రష్మిక మందన్నను ఈ సినిమాలో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ప్రతినాయిక పాత్ర పోషించేలా చేశారు. మరి ఈ పాత్ర వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ALSO READ:పెళ్లిరోజే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్!
ఇక మరొకవైపు ఒకప్పుడు నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడ వంటి చిత్రాలతో ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున – టబు జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇకపోతే 30 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. నాగార్జున కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నాగార్జున 100వ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకప్పుడు నాగార్జునతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారట. ఇక రొమాన్స్ తో మెప్పించిన వీరు ఇప్పుడు ప్రత్యర్థులుగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ప్రముఖ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఈ వారాంతంలో కీలక ప్రకటన వెలువడనుంది.
ఇదిలా ఉండగా నాగార్జున తాజాగా తన వందవ చిత్రం పై ఊహించని బజ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తన వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన నాగార్జున .. నాగ్ 100 మూవీ నుండి బిగ్ అనౌన్స్మెంట్ జూలై రెండవ వారంలో ఉండబోతోంది అంటూ హింట్ ఇచ్చారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు రాబోతున్నాం అంటూ ఆయన స్పష్టం చేశారు. పేదరికం నుంచి స్వయంకృషితో ఎదిగిన ఒక పెద్ద సంపన్నుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రాబోతుందట. పైగా ఇందులో సుష్మిత బట్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.