Peddi Release :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదల ముందర ట్రేడ్ వర్గాల్లో ఫుల్ డిసప్పాయింట్ ని మిగులుస్తోంది. వస్తున్న అప్ డేట్స్,చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే పెద్దిపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి, కానీ మేకర్స్ ప్లానింగ్ లోపాలు, డిస్టిబ్యూటర్ ల వైఫల్యాల వల్ల సినిమా బిజినెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని ప్రచారం చేస్తున్నా, విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ నే ఇస్తుంది. గతంలో ప్రభాస్ ‘సలార్’ లేదా జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రాల విడుదలకు వారం రోజుల ముందే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోగా, ‘పెద్ది’ సినిమాకు మాత్రం చివరి నిమిషంలోనూ థియేటర్ల దగ్గర సైలెన్స్ కనిపిస్తుంది.
పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం మేకర్స్ అసమర్థత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి భారీగా రేట్లు పెంచుకునేందుకు మూడు రోజుల క్రితమే అనుకూలమైన జీవో ఇచ్చింది. జూన్ 3న బుధవారం సాయంత్రం పడే స్పెషల్ ప్రీమియర్ షోలకు ఏకంగా రూ. 600 టికెట్ ధర పెట్టుకునేలా, జూన్ 4 నుండి 13వ తేదీ వరకు రోజుకు 6 షోలతో పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్సుల్లో రూ. 125 అదనంగా వసూలు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. దీనివల్ల సాధారణంగా ఉండే రూ. 50 నేల క్లాస్ టికెట్ ధర మొదటి పది రోజులు రూ. 150 కానుంది.
అలాగే మల్టీప్లెక్స్ లలో కనీస టికెట్ ధర రూ. 400 దాటనుంది. సాధారణ ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్న ఈ రేట్లకు తోడు, ప్రీమియర్ షోలకు 24 గంటల సమయం కూడా లేని సమయంలో ఇప్పటికీ ‘బుక్ మై షో’ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ లో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడం మేకర్స్ అసమర్థతను చూపిస్తోంది. ఏపీలో ఇంత పెద్ద లీగల్ సపోర్ట్ ఉన్నా థియేటర్ ఓనర్స్ తో అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడంలో మైత్రీ మూవీ మేకర్స్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుమారు రూ. 10 కోట్ల వరకు భారీ నష్టం
మరోవైపు నైజాం (తెలంగాణ) రీజియన్‌లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రత్యేక జీవో వస్తుందా రాదా అనే సస్పెన్స్ ఇండస్ట్రీ వర్గాలను వేధిస్తోంది. కోర్టు కేసులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ జీవోను గోప్యంగా ఉంచిందని కొందరు సర్దిచెప్పుకుంటున్నా, అసలు విషయం అది కాదని టాక్. సోమవారమే నైజాం ఏరియా పంపిణీ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సాధారణ రేట్లతోనే బుకింగ్స్ ఓపెన్ చేయాలని భావించినా, ప్రొడ్యూసర్ సతీష్ మరింత వరకు బుకింగ్స్ ఆపినట్లు ఇండస్ట్రీ కోడై కూస్తోంది.
ఒకవేళ ప్రత్యేక జీవో రాకపోతే సాధారణ ధరలకే సినిమాను విడుదల చేసేలా మరో ప్లాన్ సిద్ధం చేశామని నిర్మాతలు చెబుతున్నా, రేట్లు పెంచకపోతే ఒక్క నైజాం ఏరియా నుంచే నిర్మాతకు సుమారు రూ. 10 కోట్ల వరకు భారీ నష్టం వాటిల్లనుందని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.
సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో
ఈ రేట్ల గొడవ, థియేట్రికల్ వివాదాలు ఎలా ఉన్నా జూన్ 3వ తేదీ బుధవారం రాత్రికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘పెద్ది’ ప్రీమియర్ షోలు వేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే ప్రీమియర్స్ షెడ్యూల్ అయ్యాయి కాబట్టి, అక్కడ షోలు పడి తెలంగాణలో పడకపోతే కొన్ని నిమిషాల్లోనే సినిమా హెచ్‌డీ ప్రింట్ పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లోకి వచ్చే ముప్పు పొంచి ఉంది. పైరసీ భయంతో జీవో వచ్చినా రాకపోయినా బుధవారం రాత్రికి నైజాంలో సాధారణ ధరలకైనా షోలు వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు. అయినప్పటికీ టికెట్లు ఆన్‌లైన్‌లో దొరక్క అభిమానులు బ్లాక్ మార్కెట్ ఆశ్రయించాల్సి వస్తోంది.
గతంలో రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమాకు కూడా ఇలాగే ప్రమోషన్ లోపాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల భారీ నష్టాలు రాగా, ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకు కూడా విడుదలకు ముందే నెగెటివ్ టాక్, మేనేజ్‌మెంట్ ప్లాప్ డిసీషన్స్ సినిమాకి శాపంగా మారేలా కనిపిస్తున్నాయి.చూడాలి మరి వీటన్నింటిని దాటుకొని సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also read :లీకుల ఊబిలో ‘స్పిరిట్’.. సెట్ నుండి షాకింగ్ వీడియో వైరల్.. సందీప్ వంగాపై ఫ్యాన్స్ ఫైర్!