Ramayana Rights: దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక వెండితెర అద్భుతం ‘రామాయణం’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2026 దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా, థియేటర్లలోకి రాకముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ కళ్ళు చెదిరే భారీ డీల్స్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
వెబ్ మీడియా కథనాల ప్రకారం.. ఈ రెండు భాగాల సినిమా దేశీయ పంపిణీ హక్కుల కోసం నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రస్తుతం పలువురు అగ్రశ్రేణి పంపిణీదారులతో (డిస్ట్రిబ్యూటర్స్) చర్చలు జరుపుతున్నారు. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కేవలం హిందీ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసమే మేకర్స్ ఏకంగా రూ. 450 కోట్ల భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ రూ. 300–400 కోట్ల మధ్య కుదిరినా, భారతీయ సినిమా చరిత్రలోనే ఇది ఒక సరికొత్త రికార్డు అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక థియేట్రికల్ హక్కుల రికార్డు షారుఖ్ ఖాన్ నటించిన ‘కింగ్’ సినిమా పేరిట ఉంది. ఇప్పుడు ‘రామాయణం’ ఆ రికార్డును తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
కేవలం థియేట్రికల్ హక్కులే కాకుండా, ఓటీటీ (డిజిటల్), శాటిలైట్ హక్కుల విషయంలోనూ ఈ సినిమా భారీ మొత్తాన్ని అందుకోనుంది. గతంలో రెండు భాగాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఆఫర్ చేసిన రూ. 700 కోట్లను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ టాక్. కేవలం డిజిటల్ హక్కుల ద్వారానే ఏకంగా రూ. 1,000 కోట్ల డీల్ సాధించాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
Read also-Gundeninda Gudigantalu Vidya : ‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా భారతదేశంలోనే రూ. 1,000 నుండి రూ. 1,500 కోట్ల వరకు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,500 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.