Chola Finanace: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల అరాచకాలపై మరోసారి చర్చకు దారితీసింది. నెలవారీ వాయిదా బాకీలు (EMI) సకాలంలో చెల్లించలేదనే నెపంతో ఓ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది అతిగా ప్రవర్తించి, కస్టమర్ ఇంటిపై దాడికి పాల్పడారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోన్ తీసుకున్న కష్టమర్ తమపై దాడికి పాల్పడారంటూ ఫైనాన్స్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇరువురు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామానికి చెందిన కళ్యాణ్ కుమార్ ఇంటి నిర్మాణం కొరకు గద్వాలలోని చోళా ఫైనాన్స్ కంపెనీ లో రూ.5లక్షల వరకు రుణం తీసుకున్నాడు. ప్రతి నెల రూ.12,800 చొప్పున మొత్తం 72 నెలలు ఈఎంఐ రూపంలో ఫైనాన్స్ కంపెనీల వారికి చెళ్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు పది ఈఎంఐలు చెల్లించాడు. గత మూడు నెలలుగా ఈఎంఐ చెల్లించడంలేదు. నెలవారీ వాయిదా మూడు నెలలుగా బాకీ పడటంతో ఈనెల 17న ఫైనాన్స్ సిబ్బంది ఉండపురంలోని కళ్యాణ్ నివాసానికి చేరుకోవడంతో అక్కడ కష్టమర్ లేకపోవడంతో ఆయన భార్య మహేశ్వరితో వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read: ‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ లీక్….త్రివిక్రమ్ సెంటిమెంట్ రిపీట్!
ఈ క్రమంలో కళ్యాణ్ అక్కడ చేరుకోవడంతో ఫైనాన్స్ సిబ్బంది, కష్టమర్ మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగింది. ఫైనాన్స్ సిబ్బంది కళ్యాణ్, మహేశ్వరీ ఇద్దరిపై భౌతిక దాడికి పాల్పడటంతో ఇటిక్యాల పోలీసులను ఆశ్రయించారు. కాగా ఈ ఆరోపణలను ఫైనాన్స్ సిబ్బంది ఖండించారు. తాము దాడి చేయలేదని, సదరు కస్టమరే తమపై తిరగబడి దాడికి తెగబడ్డాడని వారు ఆరోపిస్తున్నారు. ఫైనాన్స్ సిబ్బంది సైతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ ఘర్షణపై ఇరువర్గాలు ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం రాతపూర్వకంగా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, పోలీసులు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయలేదంటూ బాధితుడు కళ్యాణ్ కుమార్ ఆరోపించారు. కాగ కేసును రాజీ చేసేందుకు పోలీసులు ఎర్రవల్లి చౌరస్తాకు చెందిన ఓ వ్యక్తి ద్వారా రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జరిగిన ఘటనలపై ఇటిక్యాల ఎస్ఐని వివరణ కోరగా… ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నా కళ్యాణ్, ఫైనాన్స్ సిబ్బంది ఇద్దరు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రవి తెలిపారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల అరాచకాలపై మరోసారి చర్చకు దారితీసింది.
Also read: ఇరాన్ వ్యూహం.. అమెరికా బలహీనత.. సూపర్ పవర్‌కు తప్పని ఆయుధ కొరత!