Ranveer Singh:ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ చుట్టూ తాజాగా ఒక వివాదం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమాకు సంబంధించిన వ్యాఖ్యలే ఈ సమస్యకు కారణమయ్యాయి. ఇటీవల “ధురంధర్” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణవీర్ పాల్గొన్నారు.
ఆ కార్యక్రమంలో రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ, సినిమాలోని ఒక సన్నివేశాన్ని అనుకరించారు. అయితే ఆ సమయంలో ఆయన మహిళా దేవతను “ఫిమేల్ ఘోస్ట్” అని వ్యాఖ్యానించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు, ముఖ్యంగా దైవ సంప్రదాయాన్ని నమ్మే వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
దీంతో రణవీర్ సింగ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై మతపరమైన భావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రణవీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, రణవీర్ ఇచ్చిన క్షమాపణ సరైనదిగా కనిపించడంలేదని అన్నారు. ఆ క్షమాపణను ఆయన స్వయంగా రాయకపోయి, మేనేజ్‌మెంట్ టీమ్ ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
దీనికి ప్రతిగా రణవీర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, ఆయన ఒక అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ అఫిడవిట్ ద్వారా తన తప్పును స్పష్టంగా ఒప్పుకుని క్షమాపణ చెబుతారని చెప్పారు. అంతేకాకుండా, ఒక ఆలయానికి వెళ్లి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు.
ఈ వాదనలు విన్న న్యాయమూర్తి, రణవీర్ తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ఒక ప్రముఖ వ్యక్తిగా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా మతపరమైన విషయాల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో బాధ్యతగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేశారు. అప్పటి వరకు ఈ వివాదం ఎలా మారుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రణవీర్ ఇచ్చే అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ: Dhurandhar 2: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన ధురంధర్ 2.. ఇక అందరూ ఇది ఫాలో అవ్వనున్నారా..!