Kakikala SatyaNarayana: నవరస నటశిఖరంగా పేరు సొంతం చేసుకున్నారు దివంగత నటులు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana). 60 సంవత్సరాల సినీ జీవితంలో 777కు పైగా సినిమాలలో నటించి సంచలనం సృష్టించారు. పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రక పాత్రలు చేసిన ఈయన.. హాస్యం, ప్రతినాయక, నాయక పాత్రలు ఎన్నింటినో పోషించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇంత గొప్ప పేరు సొంతం చేసుకున్న ఈయన “నవరస నటనా సార్వభౌమ” అనే బిరుదును కూడా అందుకున్నారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కైకాల సత్యనారాయణ బాల్యం, విద్యాభ్యాసం..
1935 జూలై 25వ తేదీన కృష్ణా జిల్లా.. గుడ్లవల్లేరు మండలం.. కౌతరం అనే గ్రామంలో కైకాల లక్ష్మీనారాయణ (Kaikala Lakshmi Narayana) వారసుడిగా జన్మించారు కైకాల సత్యనారాయణ. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ,విజయవాడలో పూర్తి చేసి, ది గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడు అయ్యారు.
సినిమా జీవితం..
చదువుతున్న సమయంలోనే నాటకాలు వేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాతే సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పిన కైకాల.. చదువు పూర్తి చేసుకుని అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం ఎన్నో తిప్పలు పడ్డారు. రూమ్ దొరకక 15 రోజులపాటు పార్కులోనే పడుకున్నారట. ఇక అలా ఎన్నో కష్టాలు పడిన ఈయనకు 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాలో డిఎల్ నారాయణ ద్వారా అవకాశం లభించింది. ఎన్టీఆర్ (NTR) పోలికలు కలిగి ఉండడంతో ఎన్టీఆర్ కి డూప్ లాగా కూడా నటించారు. అలా 60 సంవత్సరాల సినీ జీవితంలో 777కి పైగా సినిమాలలో వివిధ రకాల పాత్రలు పోషించి తెలుగువారి హృదయాలను గెలుచుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చేసిన విశేష సేవకు గానూ 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2017లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు లభించాయి.
రాజకీయ జీవితం..
విలక్షణ నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అయ్యారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చిన కైకాల సత్యనారాయణ.. మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు.
నిర్మాతగా కూడా గుర్తింపు..
సత్యనారాయణ నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగారు.” సత్యనారాయణ రమా ఫిలిం ప్రొడక్షన్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. దీని ద్వారా కొదమసింహం, ఇద్దరు దొంగలు, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు.
కానరాని లోకాలకు పయనం..
అలా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన కైకాల సత్యనారాయణ.. కొంతకాలం పాటు అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. 87 సంవత్సరాల వయసులో 2022 డిసెంబర్ 23న హైదరాబాదులోని తన నివాసంలో కన్నుమూశారు. ఇక ఈయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఆయన పెద్ద కుమారుడు. ఇక ఈరోజు ఆయన జయంతి కావడంతో ఆయన గురించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.
ALSO READ:Rashmika Mandanna: ఆ 4 చిత్రాలు.. కలెక్షన్స్ కాదు.. ఆ బాధతో నరకం చూసా -రష్మిక!