Tirupati Stampede: 2025 జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన దుర్ఘటనపై.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పద్మావతి పార్క్ వద్ద టోకెన్ సెంటర్ వద్ద చోటుచేసుకున్న.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన నెలకొన్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో.. న్యాయ కమిషన్‌ను నియమించి సమగ్ర విచారణ చేపట్టింది. ఇప్పుడు ఆ నివేదికను కేబినెట్ సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంది.
కేబినెట్ నిర్ణయాలు: బాధ్యులపై చర్యలు
న్యాయ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులపై.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. వీరిలో డీఎస్పీ వి.రమణకుమార్, వేంకటేశ్వర గో సంరక్షణశాల డైరెక్టర్ హరనాథరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి చర్యల వల్లే తొక్కిసలాటకు కారణమైందని.. కమిషన్ తేల్చిందని కేబినెట్ వెల్లడించింది. టోకెన్ జారీ కేంద్రాల్లో సమర్థవంతమైన నిఘా లేకపోవడం, భక్తుల రద్దీపై అంచనాల లోపం, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ప్రమాదానికి దారితీసిందని చెప్పింది.
ఐఏఎస్ గౌతమిపై ప్రత్యేక దృష్టి
టోకెన్ కేంద్రాల నిఘాపై జేఈవోగా బాధ్యత వహించిన.. ఐఏఎస్ అధికారిణి గౌతమి వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. కమిషన్ ఆమెపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించిందని పేర్కొంది. ఆమెపై తీసుకునే చర్యల బాధ్యతను సామాన్య పరిపాలనా శాఖ (GAD)కు అప్పగించింది.
క్లీన్చిట్ పొందిన అధికారులు
తొక్కిసలాట జరిగిన సమయంలో తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్‌ఓ శ్రీధర్లపై మొదట విమర్శలు వచ్చినా, న్యాయ కమిషన్ వారిని బాధ్యత నుంచి విముక్తి చేసింది. ఈ ఇద్దరు అధికారులు ముందస్తు చర్యలకు సంబంధించి తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించారని, వారి వైఫల్యం వల్ల ప్రమాదం జరిగిందని అనుకోలేమని నివేదిక పేర్కొంది.
నివేదిక తాలూకు వివరాలు
న్యాయ కమిషన్ దాదాపు 54 మంది ప్రత్యక్ష సాక్షులను, బాధిత భక్తుల కుటుంబ సభ్యులను, గాయపడినవారిని, టీటీడీ ఉద్యోగులను, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులను విచారించింది. వారి వాంగ్మూలాలు, సాంకేతిక విశ్లేషణ, వీడియో ఫుటేజ్ ఆధారంగా నివేదికను సిద్ధం చేసింది. అందులో పద్మావతి పార్క్ వద్ద టోకెన్ జారీ కేంద్రంలో.. సరైన క్యూలైన్ వ్యవస్థ లేకపోవడం, భక్తుల నియంత్రణకు తగిన గేట్లు లేకపోవడం, ఉద్యోగుల సమన్వయం లోపించడం ముఖ్య కారణాలుగా పేర్కొంది.
భవిష్యత్ చర్యలపై సూచనలు
నివేదికలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా ఉన్నాయి:
టోకెన్ జారీ కేంద్రాలను అధునాతన సాంకేతికతతో అమర్చాలి.
భక్తుల రద్దీకి తగిన క్యూలైన్.. నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలి.
పలు భాషలలో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.
ప్రతి కేంద్రంలో అపాతకాల విపత్తుల నిర్వహణకు.. శిక్షణ పొందిన సిబ్బందిని ఉంచాలి.
భక్తుల కదలికలను పర్యవేక్షించే.. మోడరన్ సీసీటీవీ వ్యవస్థలు అమలు చేయాలి.
వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన న్యాయ కమీషన్..
తొక్కిసలాట ఘటనలో ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటీ సీవీఎస్ శ్రీధర్ కు క్లీన్ చిట్
డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించలేదు
టీటీడీ జేఈవో గౌతమిది కూడా వైఫల్యమే… https://t.co/JbKyuHHfsd pic.twitter.com/kvYpj0pPvh
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025