Boyapati Sreenu: భద్ర సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై, ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ఒకరు. బోయపాటి సినిమా రాబోతోంది అంటే అందులో హీరోలను పూర్తిగా మాస్ యాంగిల్ లో చూపిస్తారు. ఇక ఈయన ప్రస్తుతం పలు సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. చివరిగా రామ్ స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుత బోయపాటి నందమూరి నట సింహం బాలకృష్ణతో (Balakrishna)సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 (Akhanda 2)ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన నేపథ్యంలో మరోసారి ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు అయితే తదుపరి విడుదల తేదీ గురించి చిత్ర బృందం అధికారకంగా ప్రకటించకపోయినా, పలు సందర్భాలలో బాలకృష్ణ ఈ సినిమా విడుదల గురించి తెలిపారు. గతంలో బాలయ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ డిసెంబర్ ఐదో తేదీ సినిమా విడుదల కాబోతుందని తెలిపారు. అయితే తాజాగా బోయపాటి శ్రీను ఓ హిందీ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా విడుదల గురించి వెల్లడించారు.
అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కాబోతుందని ఈయన వెల్లడించారు ఇక ఈ సినిమా మొత్తం ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయంపైనే తిరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఈ సందర్భంగా బోయపాటి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ లభించింది.
మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య..
మొదటిసారి బాలకృష్ణ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించడానికి ప్రణాళికలను రచించారు. ఇక ఇప్పటికే హిందీ వర్షన్ కి సంబంధించిన డబ్బింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని, హిందీలో కూడా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని బాలకృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) నటించగా ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇక ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కగా తేజస్విని నందమూరి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి అఖండ 2 సినిమా ద్వారా బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో వేచి చూడాలి.