Rukmini Vasanth: రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) .. ‘సప్త సాగరాలు దాటి’ అనే కన్నడ డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రిషబ్ శెట్టి(Rishabh Shetty) హీరోగా నటించిన విషయం తెలిసిందే. అలా ఈ సినిమాలో రిషబ్ శెట్టితో ఏర్పడిన పరిచయమే.. ఈమెకు ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలో అవకాశం కల్పించేలా చేసింది అని తాజాగా రుక్మిణి వసంత్ తెలియజేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రుక్మిణి వసంత్ నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి నిన్న అనగా సెప్టెంబర్ 22న ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ విశేష స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అంటూ పలు భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా నిర్వహించగా.. అందులో రుక్మిణి వసంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు మొదట హోం భలే ఫిలిమ్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రిషబ్ శెట్టి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సప్త సాగరాలు దాటి సినిమా సమయం నుంచే ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఇలాంటి ఒక గొప్ప పాన్ ఇండియా మూవీలో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది – రుక్మిణి..
ఇందులో నాకు అవకాశం కల్పించిన రిషబ్ శెట్టికి థాంక్స్ చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు. ఆయన ఎప్పటికప్పుడు నాలో కొత్తదనాన్ని నింపుతూ.. నన్ను ప్రోత్సహిస్తూ ఇప్పుడు మీ ముందుకి యువరాణిలా నిల్చోబెడుతున్నారు. దీనికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా కాంతార. కచ్చితంగా ఈ సినిమా నాకు మరో జీవితాన్ని ప్రసాదిస్తుందని భావిస్తున్నాను” అంటూ రుక్మిణి వసంత్ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:RGV: పవన్, చిరంజీవి కాంబినేషన్లో మూవీ.. వర్మ ట్వీట్ వైరల్!
రుక్మిణి వసంత్ సినిమాలు..
ఇకపోతే రుక్మిణి వసంత్ ఇటీవల శివ కార్తికేయన్ (Siva Karthikeyan), ఏఆర్ మురగదాస్ (AR Muragadas) కాంబినేషన్లో వచ్చిన ‘మదరాశి’ సినిమాలో నటించింది. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈమె ఆశలన్నీ ఇప్పుడు కాంతార చిత్రం పైనే ఉన్నాయి. ఈ సినిమా తన కెరీయర్ ను కూడా మార్చేస్తుందని గట్టిగా నమ్ముతోంది రుక్మిణి వసంత్. ఈమె తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాలో అవకాశం అందుకుంది.. అలాగే ప్రముఖ హీరో యష్ చేస్తున్న టాక్సిక్ మూవీలో కూడా రుక్మిణి అవకాశం అందుకుంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే కావడం గమనార్హం.