Prabhas Spirit:సందీప్ రెడ్డి వంగా..టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లో జెండా పాతిన మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చాలు.. సందీప్ రెడ్డి వంగా మార్కెట్ ఏంటో చెప్పడానికి.ఇక తాజాగా డార్లింగ్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సందీప్ మాట్లాడుతూ.. యానిమల్ సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్‌ని చాలాసార్లు కలిశానని చెప్పాడు.కానీ తన సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చూశావా అని మాత్రం ఒక్కసారి కూడా అడగలేదని చెప్పుకొచ్చాడు.
దీనికి అవతలి నుంచి ఎందుకు అని ప్రశ్నించగా.. సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వించింది.సందీప్ మాట్లాడుతూ..”ఒకవేళ నేను ప్రభాస్‌ని సినిమా చూశావా అని అడిగితే.. ప్రభాస్ చాలా నిజాయితీగా అసలు నచ్చలేదు, ఇదేం సినిమా.. చాలా చెత్తగా ఉంది.. ఇది ఒక సినిమానేనా అని చెప్పేస్తే అప్పుడు నేనేం చేయాలి.ఆ రిస్క్ నేను అస్సలు తీసుకోలేను. అందుకే నా సినిమాలు చూశావా అని ప్రభాస్‌ని అడగలేదు” అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.
సందీప్ రెడ్డి వంగా ఇలా అన్నాడో లేదో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.సందీప్ చెప్పిన ఈ మాటల్లోనే ప్రభాస్ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుందని రెబల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ఎవరికీ నచ్చాలని అబద్ధాలు చెప్పడని.. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తిత్వం ప్రభాస్‌ది అంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అయినా సెట్‌లో అందరితో కలిసిపోయే వ్యక్తి అని చాలామంది చెబుతుంటారు.ఎంత పెద్ద వాళ్లైనా, చిన్నవాళ్లైనా అందరికీ గౌరవం ఇవ్వడం ప్రభాస్ ప్రత్యేకత అని ప్రశంసలు వస్తుంటాయి.
షూటింగ్ స్పాట్‌లో భోజనం పెట్టించడం, యూనిట్ మొత్తాన్ని తన కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం ప్రభాస్‌కు చాలా సాధారణమైన విషయం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయిందంటూ సందీప్ రెడ్డి వంగా కొత్త అప్డేట్ ఇచ్చాడు.ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది.ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఒకవైపు స్పిరిట్ అప్డేట్స్ అభిమానుల్లో జోష్ పెంచుతుంటే.. మరోవైపు సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఈ చిన్న విషయం సోషల్ మీడియాలో మరో చర్చకు దారి తీసింది.
మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ గురించి వచ్చే ప్రతి అప్డేట్ రెబల్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.