Tollywood Producers: సినిమా అంటే కేవలం నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు, మంచి కథ ఉంటే సరిపోదు.. ఆ కథను తెరపైకి తీసుకురావడానికి బడ్జెట్ పెట్టే నిర్మాత చాలా కీలకము. దర్శకుడు.. నిర్మాతల డబ్బును దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు వందల కోట్లు , వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకులను నిరాశపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రేక్షకులు నిరాశ చెందడం అటుంచితే.. వందల కోట్లు ఖర్చుపెట్టి , సినిమా తీశాక ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించకపోతే? నిర్మాతకు నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సినిమాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి, వడ్డీలు కట్టలేక ఆస్తుల అమ్ముకున్న నిర్మాతలు కూడా ఉన్నారు.
ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా పాన్ ఇండియా పేరిట సినిమా విడుదలకు ముందే సినిమాకు భారీ హైప్ ఇచ్చేయడం, నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ పేరిట ఆ హైప్ చూసి.. కోట్లు వెచ్చించి మరీ ఆ సినిమాలను కొనుగోలు చేయడం.. విడుదలయ్యాక అవి డిజాస్టర్ గా నిలిస్తే నష్టం తట్టుకోలేక లబోదిబోమనడం అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితులను చూసినా.. నిర్మాతలలో ఎందుకు మార్పు రావడం లేదు? అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాలలో తలెత్తుతోంది.. స్టార్ కాస్ట్, మంచి హైప్ సినిమాను నిలబెడతాయా అంటే ఈ మధ్యకాలంలో చెప్పలేని పరిస్థితి . కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో హైప్ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన కంటెంట్ లేకపోతే ప్రేక్షకుడు ఆదరించడు అనేది వాస్తవం.
ఇకపోతే దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల , నాని కాంబినేషన్లో మళ్లీ సినిమా అంటూ ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందనే కారణంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ హిట్టు కొడుతుందనే గుడ్డి నమ్మకమే నిర్మాతలను ఇప్పుడు పూర్తిగా ముంచేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ట్రైలర్ కూడా విడుదల చేయకుండానే ది ప్యారడైజ్ సినిమాను విడుదల చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ముందే భారీ హైప్ ఇచ్చారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు సినిమా విడుదలైంది. కానీ మొదటి టాక్ తోనే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుండడంతో నిర్మాతల పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా మాత్రం తన రెమ్యూనరేషన్ తో భారీ జాక్ పాట్ కొట్టాడు. కానీ సినిమా పూర్తికాక ముందే కోట్లల్లో అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ రూ.4కోట్లు, కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ రూ.3కోట్లు, అలాగే ఎన్నారై రూ.2కోట్లు అడ్వాన్సులు ఇచ్చారు . సినిమా విడుదల కు ముందే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ముందస్తుగా అడ్వాన్స్ చెల్లించి మరి వీరు కొనుగోలు చేశారు. కేవలం శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారనే ఒక్క కారణంతో ది ప్యారడైజ్ సినిమా కోసం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఏకంగా రూ.180 కోట్లు భారీ బడ్జెట్ కేటాయించారు.
also read:ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?
అయితే సినిమా ఫలితాన్ని ఆలోచించకుండా.. ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా ఎందుకు ఇస్తున్నారు? ముందుగానే నిర్మాతలను సినిమా సక్సెస్ అవుతుందని ఎందుకు మభ్యపెడుతున్నారు? ఇండస్ట్రీలో ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు కూడా మూతపడుతున్నా.. ప్రొడ్యూసర్లకు రూపాయి కూడా మిగలకుండా నష్టాలు వస్తున్నా..ఈ విషయం ఎవరికీ పట్టదా? అసలు నిర్మాతలు ఎందుకు సినిమా ఫలితాన్ని ఆలోచించకుండా మితిమీరిన నమ్మకంతో ముందస్తు అడ్వాన్సులు ఇస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి..ఆచితూచి అడుగులు వేయండి.. లేకపోతే నష్టపోవాల్సిందే అనే కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా వందల కోట్ల బడ్జెట్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు ఇప్పటికైనా మేల్కొని తక్కువ బడ్జెట్ తో నైనా మంచి కథలను ప్రేక్షకుడికి అందిస్తే నిర్మాతలు కూడా సేఫ్ లో ఉంటారనేది వాస్తవం అని చెప్పాలి.