Allu Arjun Summons: సినీ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ ‘సంధ్య థియేటర్’ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఐకాన్ స్టార్, సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితులందరి వ్యక్తిగత హాజరు తర్వాతే ఈ కేసులో అధికారికంగా ట్రయల్ ప్రారంభం కానుంది.
Read also-రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..
‘పుష్ప 2’ సినిమా ప్రదర్శన సమయంలో జరిగిన ఈ దుర్ఘటనపై చిక్కడపల్లి పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను A1 నుండి A10 వరకు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. తగిన ముందస్తు సమాచారం, భద్రతా ప్రమాణాలు లేకుండా థియేటర్‌కు రావడం ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై నటుడు అల్లు అర్జున్‌ను A11 పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. తాజాగా కోర్టు ఈ కేసులోని లోపాలను పరిశీలించి, అనుమతించిన అనంతరం మొత్తం 19 మంది నిందితులకు సోమవారం హాజరుకావాలంటూ సమన్లు పంపింది.
2024 డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ సినిమా స్పెషల్/బెనిఫిట్ షో సందర్భంగా భారీ జనసందోహం నెలకొంది. హీరో అల్లు అర్జున్ స్వయంగా థియేటర్‌కు వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది అభిమానులు ఒకేసారి అక్కడికి దూసుకొచ్చారు. థియేటర్ లోపలికి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా తీవ్ర తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ ఘోర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీతేజకు కిమ్స్ ఆసుపత్రిలో సుదీర్ఘ కాలం పాటు అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం ఇటీవలె కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Read also-ఫోన్‌పే వాలెట్ యూజర్లకు అలర్ట్.. ఏడాది పాటు వాడకపోతే ఇక అంతే?
గతంలో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు (డిజిటల్ ఆధారాలైన సీడీలు, హార్డ్ డిస్క్‌లు సరిగ్గా జతపరచకపోవడం) ఉండటంతో నాంపల్లి కోర్టు రెండుసార్లు దానిని తిరస్కరించింది. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీసులు లోపాలన్నింటినీ సరిదిద్ది పక్కా ఆధారాలతో తుది ఛార్జ్‌షీట్‌ను సమర్పించారు. మరోవైపు, గతంలో అల్లు అర్జున్‌కు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలనే షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాలు, అభిమానుల తాకిడి దృష్ట్యా ఆ నిబంధన నుండి బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది. అలాగే, కేసు విచారణలో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్‌పై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయరాదని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ సహా మిగిలిన నిందితులు కోర్టుకు హాజరుకానుండటంతో, న్యాయస్థానం ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.