Sheraz Mehdi:సాధారణంగా ఏ హీరో అయినా సరే తన పుట్టినరోజు వేడుకల సమయంలో చాలా సంతోషంగా అభిమానుల ప్రేమాభిమానాల మధ్య తన బర్త్ డేను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సినిమా హీరో మాత్రం తన సినిమా విడుదలకు ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎవరో కాదు షిరాజ్ మెహదీ(Sheraz Mehdi).. తాను హీరోగా, దర్శకుడిగా మారి ఎంతో కష్టపడి రూపొందించిన ఓ అందాల రాక్షసి చిత్రానికి థియేటర్లు కేటాయించడం లేదని, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది అంటూ ఆరోపించారు. బంజారాహిల్స్ లోని ‘అఆ సినీ స్టూడియోస్’ లో మీడియా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు, ప్రెస్ మీట్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షిరాజ్ మెహదీ తెలిపారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించి సినిమాలు రూపొందిస్తున్నప్పటికీ వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సరైన అవకాశం లభించడం లేదు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా మిగిలిన సినిమాలు, థియేటర్ల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడులు తిరిగి రాక నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొనింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
“నా సినిమా ఓ అందాల రాక్షసి విడుదల కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించడం లేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు కష్టంగా మారింది. హైదరాబాదులో కూడా పరిమిత సంఖ్యలో స్క్రీన్లు మాత్రమే లభిస్తున్నాయి. థియేటర్లలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలు చివరి నిమిషం వరకు తెలియకపోవడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నా చిత్రానికి ఆడియో, ఓటీటీ, శాటిలైట్ ఇతర భాషల హక్కుల విషయంలో కూడా ఆశించిన అవకాశాలు లభించలేదు అంటూ తెలిపారు.
చిన్న సినిమాల సమస్యలపై పలుమార్లు ప్రెస్ మీట్ లు పెట్టి ఇంటర్వ్యూల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ ఫిలిం ఛాంబర్ నుంచి కనీస స్పందన కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం న్యాయపరమైన మార్గాలను కూడా ఆశ్రయించానని, అయినప్పటికీ తన సమస్యకు పరిష్కారం దొరకలేదని, గత ఏడాదిన్నరగా ఒంటరిగానే పోరాటం చేస్తున్నానని చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే వరకూ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
also read:జానీ మాస్టర్ పై మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రేష్టి వర్మ!
ఊటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తాను.. అనంతరం దుబాయ్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ అభ్యసించానని, ఆ తర్వాత దర్శకత్వంలో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని షిరాజ్ తెలిపారు. పాడు చీకటి, కేఏస్ 100, యు ఆర్ మై హీరో, పౌరుషం, ఓ అందాల రాక్షసి వంటి చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ న్యాయమైన అవకాశాలు లభించే వ్యవస్థ అవసరమని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
చిన్న సినిమాల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి అని విజ్ఞప్తి చేశారు. థియేటర్ల కేటాయింపు, సినిమా విడుదల, ఇతర హక్కులకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా పరిశీలించి చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించి, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా పలు మార్పులు తీసుకురావాలని కోరారు. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంపై సీఎం స్పందిస్తారో లేదో చూడాలి.