Sing Geetham:సింగీతం శ్రీనివాసరావు… ఇండియన్ సినిమా ఎక్స్పరిమెంట్స్ కి కేరాఫ్. కమల్ హసన్ తో మాటలు లేకుండా ‘పుష్పక విమానం’క్లాసిక్ అనే తీసినా, అదే కమల్ తో విచిత్ర సోదరులు తీసినా, సైన్స్ ఫిక్షన్ జోనర్ లో బాలయ్యతో ఆదిత్య 369’, భైరవ ద్వీపం వంటి కల్ట్ క్లాసిక్స్ తీసినా అది ఒక్క సింగీతంకే సొంతం.
అలా తన కెరీర్ లో ఎన్నో సినిమాలు తీసినా ఇంకా నాలో క్రియేటివిటీ తగ్గలేదు అంటూ 94 ఏళ్ల వయసు వచ్చినా అదే జోష్ తో తెరకెక్కించిన సినిమా ‘సింగ్ గీతం’. మ్యూజికల్ ఫాంటసీ డ్రామా జానర్ లో వచ్చిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ ని మెప్పించిన సంగతి తెల్సిందే. అయితే ఊహించని విధంగా ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పట్టడం విశేషం. అవును… జూలై 8 అంటే ఈ రోజునుంచే ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
కథ విషయానికి వస్తే ఒక ఊరిలోని బంగారు గనుల మీద అక్కడి వారి కన్ను పడి,అక్కడ ఉన్న ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తారు. అలాంటి ఊరిలో మిగిలి ఉన్న చివరి పవిత్రమైన చెట్టును వాళ్ళు అత్యాశతో నరికేస్తారు.దాంతో ప్రకృతికి కోపం వచ్చి ఆ ఊరికి ఒక వింతైన శాపాన్ని ఇస్తుంది. ఆ తర్వాతి రోజునుండి ఉదయం నుంచి ఆ ఊరి ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోతారు. తమ మనసులోని కోపం, ప్రేమ, ఆరాటం, బాధ ఇలా ప్రతి భావాన్ని కేవలం పాట రూపంలో మాత్రమే చెప్పాల్సిన వింత పరిస్థితి ఎదురవుతుంది.
నిజానికి వినడానికే వెరైటీగా అనిపించే ఈ కథకి తెరకెక్కించడం ఒక్క సింగీతంకే సాధ్యం.మాటలు లేకుండానే అక్కడి మనుషులు ఎలా తమలోని భావాలని ఇతరులతో పాట రూపంలో పంచుకున్నారు, ఆ పరిస్థితి వల్ల ఆ ఊరిలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది అనేదానికి చాలా ఆసక్తిగా తెరపై చూపించాడు సింగీతం.చివరికి ఆ ఊరి జనం తమ తప్పును తెలుసుకుని, ప్రకృతిని కాపాడుకుంటూ ఆ శాపం నుండి ఎలా విముక్తి పొందారు అనే క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.ఇక నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
also read:రోజుకు 12 బాటిళ్ళు..వ్యసనానికి బానిసై..45 ఏళ్లకే తనువు చాలించిన విలక్షణ నటుడి కన్నీటి గాథ!
ఏది ఏమైనా 90 ఏళ్ల వయసులో ఉన్నవారంతా రామకోటి రాసుకుంటున్నఈ రోజుల్లో ఇలా 94 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా రికార్డులని తిరగరాస్తున్న సింగీతం ఈ ఇండియన్ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అని చెప్పకతప్పదు.