Skn: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సినిమా కార్మికులకు, నిర్మాతలకు మధ్య ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొంతమంది నిర్మాతలు రాజకీయ ప్రముఖులను కూడా కలిశారు. కొంతమంది చిన్న సినిమాలను నిర్మించే నిర్మాతలు కూడా ప్రెస్మీట్ లో పెట్టి వాళ్ల ఇబ్బందులు చెప్పారు. నిర్మాత ఎస్ కే ఎన్ అందరినీ ఒక చోటకు చేర్చి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఈ సమస్యల గురించి మరోసారి స్పందించాడు.
ఇప్పుడు సినిమాలు చేయలేరు
ఎస్ కే ఎన్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ… 50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు తీయలేరు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తున్నారు.
ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు. అనేక కారణాలతో నిర్మాతలకు సినిమాల నుంచి తమ పెట్టుబడికి తగిన ఆదాయం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు పెంచడం నిర్మాతలపై మరింత భారమవుతుంది.
సినీ కార్మికులకు ఈ ఏడాది 10శాతం, వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు 5 శాతం పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ పెంపు ఇతర చిత్ర పరిశ్రమల్లో కార్మికులకు చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం. రోజుకు 2 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ఇంకా పెంచడం ఏమాత్రం సరైనది కాదన్నది నిర్మాతల అభిప్రాయం.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా మేకింగ్ ను ఇంకా సమర్థవంతంగా చేసే మార్గాలను నిర్మాతలు అన్వేషించాల్సిఉంది. సినీ కార్మికులకు వేతనాలు పెంచడాన్ని చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదు.
సినిమా కోసం 24 క్రాఫ్టుల కార్మికులు పనిచేసే విధానం మారాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల కిందట యూనియన్లు రాసుకున్న నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలు నిర్మించలేరు.
దేశీయంగా హైదరాబాద్ నగరం సినీ రంగానికి హబ్ గా మారుతోంది. కార్మికులు ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఇతర భాషల నుంచి మేకర్స్ నగరానికి రావడానికి ఆసక్తి చూపించరు. సృజనాత్మక పరిశ్రమ అయిన టాలీవుడ్ లో స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉంది. యూనియన్ లో చేరేందుకు లక్షలాది రూపాయలు రుసుములు వసూలు చేస్తుండటం కొత్త టాలెంట్ చిత్ర పరిశ్రమలోకి రావడం అవరోధంగా మారుతోంది. అంటూ స్పందించారు. రెండు రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
Also Read: Tamannaah Bhatia: కావాలయ్యా అంటున్న తమన్నా… మిల్క్ బ్యూటీలో ఈ మార్పు చూశారా?