Hyderabad Metro New Coaches: హైదరాబాద్ మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను యాడ్ చేయడంతో పాటు, కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ఒక్కో రైలులో ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రో రైళ్ల రద్దీ, భవిష్యత్ విస్తరణ, ఓల్డ్ సిటీ మెట్రో పనులు సహా పలు అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని మెట్రో మార్గాల్లో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదనపు కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కొత్త కోచ్‌లు వెంటనే అందుబాటులోకి రావు. హైదరాబాద్ మెట్రో రైళ్లకు అవసరమైన కోచ్‌లను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉండటంతో వాటిని తయారు చేసి తీసుకురావడానికి సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రతి మెట్రో రైలు సెట్‌కు నిర్దిష్ట సాంకేతిక ప్రమాణాలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే కొత్త కోచ్‌లను తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మార్గం కోసం అవసరమైన రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర పరిపాలనా అంశాలను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెట్రో రెండో దశలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. సాంకేతికత, ఆధునిక రవాణా విధానాలపై DMRCతో సమన్వయం చేసుకోవాలని HMRL అధికారులకు తెలిపారు. అయితే మెట్రో విస్తరణలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా కీలకంగా మారనున్నాయి. చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియల కారణంగా కొన్ని అనుమతులకు సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా, మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లు తీసుకురావడం, ఓల్డ్ సిటీ మార్గాన్ని వేగవంతం చేయడం ద్వారా హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!