The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలోనే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర.. ఇలా వరుసగా అమ్మడు హిట్ కొడుతూనే వస్తుంది. దీంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రష్మిక చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నవే. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా మొదలుపెట్టింది.
అందాల రాక్షసి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.. చిలసౌ సినిమాతో డైరెక్టర్ గా మారిన విషయం తెల్సిందే. మన్మథుడు 2 సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న రాహుల్ ఆ తరువాత డైరెక్షన్ కు కొంత గ్యాప్ ఇచ్చి చాలా కాలం తరువాత రష్మికతో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేశాడు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి నిర్మిస్తుంది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దసరా ఫేమ్ దీక్షీత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏం జరుగుతోంది అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదొక లవ్ సాంగ్ లా వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ సాంగ్ ను బట్టి రాహుల్.. చిలసౌ లాంటి కథతోనే వస్తున్నట్లు కనిపిస్తుంది.
రష్మిక డ్రెస్సింగ్ స్టైల్, ఎంతో పద్దతిగా, సైలెంట్ గా ఆమె క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక కాలేజ్ లో తన సీనియర్ తో ప్రేమలో పడడం, అతనిపై తనకున్న భావాలను ఈ లిరిక్స్ లో ఎంతో అద్భుతంగా చూపించారు. రష్మిక- దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్ లో చూపించినట్లు తెలుస్తోంది. ఇక రాకేందు మౌళి అందించిన లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఈ సాంగ్ కచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోనూ ఈ సాంగ్ ను చిన్మయి తన మెస్మరైజ్ వాయిస్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.