Raja Saab Theatre Fire సంక్రాంతి సినిమాల సందడి ప్రభాస్ చిత్రంతో మొదలైపోయింది. అందులో ప్రభాస్ సినిమా విడుదల అవుతోందంటే అభిమానుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ది రాజా సాబ్ విడుదలతో.. సంక్రాంతి పండగ కన్న ముందే.. చాలా ప్రాంతాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పూలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆనందం కొన్ని చోట్ల హద్దులు దాటుతోంది. తాజాగా ఒడిశాలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభాస్కి విపరీతమైన అభిమానులు ఉన్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో ఉన్న అశోక్ థియేటర్లో షాకింగ్.. ఘటన చోటు చేసుకుంది. సినిమా ప్రారంభ సమయంలో ప్రభాస్ ఎంట్రీ సీన్ రావడంతో కొందరు అభిమానులు హద్దులు మరిచి ప్రవర్తించారు. తమ ఆనందాన్ని చూపించేందుకు థియేటర్ లోపలే కాగితాలు వేసి వాటికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ అంతా పొగతో నిండిపోయింది.
స్క్రీన్‌కు దగ్గరగా మంటలు ఎగసిపడటంతో అక్కడున్న ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యారు. థియేటర్ సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగకముందే అక్కడున్న కొందరు అభిమానులే మంటలను ఆర్పేశారు. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండేది.
ఇలాంటి పనులు ఎంత ప్రమాదకరమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ మంటలు కుర్చీలకు లేదా స్క్రీన్‌కు అంటుకుంటే భారీ నష్టం జరిగేది. అంతేకాదు, ప్రాణ నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అభిమానులు డబ్బులు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి సినిమా చూడడం సహజమే. కానీ నిప్పుతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదు.
సినిమా అనేది వినోదం మాత్రమే అనే విషయం అభిమానులు గుర్తుంచుకోవాలి. తమ సంబరాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. థియేటర్ యజమానులు కోట్ల రూపాయలు.. పెట్టి హాళ్లు నిర్మిస్తారు. ఇలాంటి ఘటనల వల్ల వారికి పెద్ద నష్టం కలుగుతుంది. అలాగే నిర్మాతలకు కూడా సమస్యలు ఎదురవుతాయి.
ప్రభాస్‌కు ఉన్న అభిమాన గణం చాలా పెద్దది. ఇలాంటి అవివేకపూరిత చర్యల వల్ల హీరోల పేరుప్రతిష్టకు కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. పండగలా సినిమా చూసి ఆనందంగా ఇంటికి చేరడం అసలైన సెలబ్రేషన్. ప్రమాదకరమైన పనులు చేయకుండా..బాధ్యతాయుతమైన అభిమానిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
ALSO READ: Sreeleela: శ్రీలీల వింత ప్రశ్న.. నవ్వు ఆపుకోలేకపోయిన హీరో