Tollywood 2025 : టాలీవుడ్ ఇండస్ట్రీలో జనవరి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే, మరికొన్ని సినిమాలు అభిమానుల ఊహకు అందని విధంగా డిజాస్టర్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. టాలీవుడ్ పాన్ ఇండియాని శాసిస్తోందని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ.. రియాలిటీలో చూస్తే సక్సెస్ రేట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. గడిచిన ఆరు నెలల్లో పట్టుమని పది సినిమాలు కూడా హిట్టవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఈ ఆరు నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు.. వాటికి పెట్టిన బడ్జెట్ వచ్చిన కలెక్షన్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం..
2025 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ సినిమాల రిపోర్ట్..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త డల్ గానే సాగింది. జనవరి 10న విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ మూవీ, నిర్మాతకి దాదాపు రూ.200 కోట్ల నష్టాలను మిగిల్చింది. శంకర్ టేకింగ్‌పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ఫ్లాప్‌ని డైరెక్టర్ శంకర్, స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజు, తమన్ తప్పు కాదని చేతులు దులుపుకున్నారు.
జనవరి 12న వచ్చిన నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ బ్రేక్ ఈవెన్ దాకా వచ్చినా, క్లీన్ హిట్‌గా నిలవలేకపోయింది.. కానీ గతంలో బాలయ్య నటించిన సినిమాలకు మించి ఈ సినిమా కలెక్షన్స్ ని వసూలు చేసింది. మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా భారీగానే వసూలు చేయడంతో ఈ మూవీ హిట్ అయ్యింది.
జనవరి 14న వచ్చిన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఊహించని విధంగా సంచలన విజయం అందుకుంది. రూ.50 కోట్లతో తెరకెక్కి, రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఫిబ్రవరి 7న అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ మూవీ వచ్చింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న చైతూకి కావాల్సిన విజయాన్ని అందించింది.. ఆ తర్వాతి వారం వచ్చిన బ్రహ్మానందం, మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రాలు డిజాస్టర్ గా మారాయి.
మార్చి 14న నాని సమర్పణలో వచ్చిన ‘కోర్ట్’ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ‘దిల్ రూబ’, ‘రాబిన్‌హుడ్’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నెలాఖరున వచ్చిన ‘మ్యాడ్ స్క్వైర్’ మూవీ రూ.70 కోట్ల దాకా రాబట్టి హిట్టు సినిమాగా నిలిచింది..
అలాగే ఏప్రిల్ నెలలో ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ హిట్ సినిమా పడలేదు.. సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’, యాంకర్ ప్రదీప్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, తమన్నా భాటియా ‘ఓదెల 2’, కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఇలా వరుసగా అన్ని యావరేజ్ సినిమాలే ప్రేక్షకులను పలకరించాయి.
మే నెల విషయానికొస్తే.. నాని హీరోగా వచ్చిన ‘హిట్: ద థర్డ్ కేస్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాల తర్వాత వచ్చిన మంచు మనోజ్ భైరవం మూవీ, సమంత నిర్మించిన శుభం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
జూన్ నెల విషయానికొస్తే.. మొదటి మూడు వారాలు పెద్దగా సినిమాలు లేవు. నాలుగు వారం భారీ అంచనాలతో కుబేర సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఈ వారం కూడా స్టడీ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.. రీసెంట్ గా వచ్చిన మంచు విష్ణు కన్నప్ప మూవీ టాక్ తో పనిలేకుండా పర్వాలేదు అనే కలెక్షన్స్ ని రాబడుతుంది.
Also Read:ఆ ఒక్కటి ఉంటే చాలు.. రెమ్యూనరేషన్ పట్టించుకోను..
2025 సెకండ్ హాఫ్ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే..
నెక్స్ట్ రాబోతున్న సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘OG’, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’, బాలయ్య ‘అఖండ 2’, ఎన్టీఆర్ ‘వార్ 2’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘విశ్వంభర’, వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందో చూడాలి.