Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ..వీరిద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు.ఇక త్రివిక్రమ్ రైటర్ గా వెంకీ హీరోగా వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్’ (2001), ‘మల్లీశ్వరి’ (2004) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేసిన ఆ సినిమాలు, ఇప్పటికీ టీవీల్లో వస్తే అతుక్కుపోతారు మూవీ లవర్స్.
అలా వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఆ సినిమాల క్రేజ్ అస్సలు తగ్గలేదు.అలాంటిది ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్ నుండి ‘ఆదర్శ కుటుంబం’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ కావడంతో దీనిపై భారీ అంచనాలే పెట్టేసుకుంది టాలీవుడ్.
ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక పెద్ద రిలీఫ్
అసలే ప్రస్తుతం టాలీవుడ్ అంతా పాన్ ఇండియా జపం చేస్తోంది. భారీ బడ్జెట్, రక్తపాతం, ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.ఇలాంటి యాక్షన్ సినిమాలు కుప్పలుగా వస్తుండటంతో ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం వస్తే బాగుణ్ణు అని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు ఆడియన్స్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ‘ఆదర్శ కుటుంబం’ లాంటి టైటిల్‌తో వెంకీ-త్రివిక్రమ్ రాబోతుండటం ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.
వెంకటేష్ కెరీర్‌లో ‘కలిసుందాం రా’ (2000), ‘రాజా’ (1999) లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు ఎలాంటి వసూళ్లు సాధించాయో, ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సైలెంట్ క్లాసిక్‌గా నిలిచిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కథలో సరైన ఎమోషన్స్ కుదిరితే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం.
ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన గుంటూరు కారం
అయితే, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎంతటి పాజిటివిటీ ఉందో, అంతే స్థాయిలో కొన్ని నెగెటివ్ డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ ప్రస్తుత ఫామ్. ఒకప్పుడు ‘అత్తారింటికి దారేది’ (2013), ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేసి సక్సెస్ కొట్టిన గురూజీ, ఇటీవల కాలంలో ఆ మ్యాజిక్‌ను పూర్తిగా మిస్ అవుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కథనంలో పస లేకపోవడం, త్రివిక్రమ్ మార్క్ పంచు డైలాగులు వెలవెలబోవడం లాంటి అంశాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అంతకుముందు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ (2020) హిట్ తర్వాత గురూజీ సక్సెస్ గ్రాఫ్ పూర్తిగా డౌన్ ఫాల్ లో పడిందన్నది ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట.
ఈ క్రమంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా త్రివిక్రమ్‌కు ఒక లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి. వెంకటేష్ ఇమేజ్‌కు సరిపోయేలా క్లీన్ ఫ్యామిలీ డ్రామాను రాస్తూనే, నేటి తరం ప్రేక్షకులను మెప్పించేలా కథనాన్ని నడిపించడం ఇపుడు త్రివిక్రమ్ ముందున్న పెద్ద సవాల్.ఒకవేళ త్రివిక్రమ్ తన పాత కలం పదునుని మళ్లీ చూపిస్తే, ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి ఆల్‌టైమ్ క్లాసిక్ రిపీట్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, మళ్లీ పాత చింతకాయ పచ్చడి కథలతోనే కాలక్షేపం చేస్తే మాత్రం గుంటూరు కారం లాంటి సాలిడ్ డిజాస్టర్ ఈసారి వెంకీ ఫ్యాన్స్ చూడటం ఖాయం.ఏదేమైనా, ఈ ఇద్దరు దిగ్గజాల కలయికపై ట్రేడ్ వర్గాల్లోను, ఇటు ప్రేక్షకుల్లోను ఇంటర్నల్ గా భారీ అంచనాలే ఉన్నాయి. మరి తనపై వస్తున్న విమర్శలకు ఈ ‘ఆదర్శ కుటుంబం’తో ఎలాంటి కౌంటర్ వేస్తాడో చూడాలి.
also read :నందమూరి తేజస్విని డాన్స్ వైరల్… బాలయ్య కూతురా మజాకా..