Venuswamy Varanasi:జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తనదైన కామెంట్స్ తో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
అంతేకాదు, తంత్రం, మంత్రం, దశమహావిద్యలు, సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే కాంట్రవర్సీ ల గురించి కూడా ఆయన తనదైన శైలిలో చెప్పడం ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ సాధారణంగా వినాయకుడు, వెంకటేశ్వర స్వామి వంటి సాత్విక దేవతలు మన కష్టాలను తొలగిస్తారని, అయితే పదవి, డబ్బు, అధికారం వంటి ఫలితాలను కోరుకునేవారు దశమహావిద్యల వైపు వెళ్తారని ఆయన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.
కింగ్ మేకర్ కావాలన్నదే నా లక్ష్యం!
ఇక చిన్నప్పటి నుంచి తనకు కింగ్ మేకర్ కావాలనే ఆలోచన ఉండేదని వేణుస్వామి తెలిపారు. ఒక సాధారణ వ్యక్తిని సూపర్ స్టార్‌గా, సాధారణ వ్యక్తిని కోటీశ్వరుడిగా మార్చగలిగే శక్తి దశమహావిద్యల సాధనలో ఉందని తాను నమ్మినట్లు చెప్పారు. ఈ ఆలోచనతోనే కామాఖ్యకు వెళ్లి దశమహావిద్యల దీక్ష తీసుకున్నట్లు వివరించారు.
ఒక్కో విద్యకు పది రోజుల చొప్పున మొత్తం వంద రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు . ఈ సాధనలో భాగంగా ఐదు కోరికలను మాత్రమే సంకల్పంగా రాసుకుంటారని, వాటిని అమ్మవారికి నివేదిస్తారని చెప్పారు. వామాచార పద్ధతిలో మద్యం, మాంసాహారం వంటి కొన్ని నియమాలు కూడా ఉంటాయని వివరించారు.
మిరాయ్, వారణాసి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతూ ఇప్పటివరకు సినిమా రంగంలో దశమహావిద్యలు, వామాచారానికి సంబంధించిన అంశాలను ఇద్దరు మాత్రమే టచ్ చేశారని ఆయన అన్నారు. అందులో ఒకటి మంచు మనోజ్ నటించిన ‘మిరాయ్’ కాగా, మరొకటి రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ అని తెలిపారు.
‘మిరాయ్’ సినిమాలో బగళాముఖి అమ్మవారికి సంబంధించిన అంశాలను చూపించారని, ఆ సినిమాలో ఆ పాత్ర చేసినందుకే మంచు మనోజ్ వివాదాల్లో చిక్కుకున్నారని వేణుస్వామి సెన్సేషన్ కామెంట్స్ చేశారు. అలాగే ‘వారణాసి’ సినిమా లాంచ్ కార్యక్రమంలో చిన్నమస్తా దేవికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారని చెప్పారు.
చిన్నమస్తా అమ్మవారు తన తలను తానే ఖండించుకున్న రూపంలో దర్శనమిస్తారని వివరిస్తూ, ఈ అంశాలు తెరపైకి వచ్చినప్పుడే సినిమా చుట్టూ సంచలనాలు మొదలవుతాయని చెప్పారు.
నాకు ఇష్టమైన అమ్మవారు బగళాముఖి!
దశమహావిద్యల్లో తనకు అత్యంత ఇష్టమైన అమ్మవారు బగళాముఖి అని వేణుస్వామి స్పష్టం చేశారు. తన జాతకంలో రాహువు ఉచ్చస్థితిలో ఉండటం, కలియుగంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తన నమ్మకం కారణంగా బగళాముఖి అమ్మవారితో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని వివరించారు.
మరోవైపు మహిళలను అమ్మవారి స్వరూపంగా చూడాలనేది వామాచారంలో తనకు నేర్పిన మొదటి నియమమని చెప్పారు. ఏ హీరోయిన్ దగ్గరైనా, ఆర్టిస్ట్ దగ్గరైనా, సెలబ్రిటీ దగ్గరైనా పూజల కోసం డబ్బులు తీసుకోలేదని కూడా అసలు విషయం చెప్పుకొచ్చారు.మొత్తానికి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో చిన్నమస్తా దేవి ప్రస్తావన ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి !
ALSO READ:తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేస్తున్నాడు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!