Vijay Devarkonda : తిరుపతిలో జరిగిన ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆయన చిత్తూరు యాసలో మాట్లాడడంపై అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
చిత్తూరు యాసలో చింపేసిన రౌడీ హీరో
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఈ నెలాఖరున రిలీజ్ కు సిద్ధమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. జూలై 31న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు.
ఈవెంట్ లో “తిరుపతీ… ఎట్లా ఉండారు అందరూ? బాగుండారా? ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము…మన తిరుపతి ఏడుకొండల ఎంకన్న సామి గానీ… ఈ ఒక్కసారి నా ప్రక్కనుండి నన్ను నడిపించినాడో శానా పెద్దోడినై పూడుస్తాను సామీ… టాప్ లో పోయి కూర్చుంటూ…ఇంక మిగిలింది రెండే… ఆ వెంకన్న సామి దయ… మీ అందరి ఆశీస్సులు… ఈ రెండుగానీ నాతో పాటూ ఉంటే వానెక్క ఏ నాకొడుకు మనల్ని ఆపేదిలే…మా పాలెగాడు అనిరుధ్ పగలగొట్టినాడు… మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు సంపినాడులే…ఆ వెంకన్న సామి దయ, మీ అందరి ఆశీస్సులు గానీ నాతో పాటూ ఉంటే… వానెక్క ఏ నాకొడుకు మనల్ని ఆపేదిలే…” అంటూ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపే ప్రయత్నం చేశారు విజయ్ దేవరకోండ.
ఇంకా దిగలేదా? కొత్త వివాదం షురూ
కాగా గతంలో విజయ్ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వివాదం పెద్దదవ్వడంతో దేవరకొండ దిగివచ్చి క్షమాపణలు చెప్పినా, ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. దీంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Read Also : వెంకన్న సాక్షిగా… పుష్ప డైలాగ్స్ చెప్తే సరిపోదు.. హిట్ కూడా కొట్టాలి విజయ్
ఈ నేపథ్యంలోనే మరోసారి ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ‘వానెక్క ఏ నాకొడుకు మనల్ని ఆపేదిలే…’ అనే డైలాగును ఈ నటుడు ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ బన్నీ స్టైల్ ను ఫాలో అవుతూ… చిత్తూరు యాసలో చెప్పినా, కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇంకా విజయ్ కు పొగరు దిగలేదా? ఆ డైలాగ్ ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. మరి ఈ డైలాగ్ ఎలాంటి దుమారానికి దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా రౌడీ హీరో అంటే వివాదం… వివాదం అంటే రౌడీ హీరో అన్నట్టుగా మారింది పరిస్థితి. దీన్నుంచి దేవరకొండకు ఆ ఏడుకొండలవాడే కాపాడాలి.