HBD Ali: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు కమెడియన్ అలీ(Ali). 1968 అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో జన్మించారు. నేటితో 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈరోజు అలీ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. విషయంలోకి వెళ్తే.. రాజమండ్రిలో పుట్టిన ఆయన కుటుంబ వాస్తవ్యులు.. బర్మాకు చెందినవారట. అయితే మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు అలీ. ఈయన పూర్తి పేరు మహమ్మద్ అలీ. అయితే వీరి కుటుంబం బర్మాలో సెటిల్ అయ్యారట. అక్కడే వ్యాపారం కూడా చేసుకునే వారట. కానీ రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో అక్కడ పరిస్థితులు అతలాకుతలమై జీవనానికి కష్టమవడంతోనే.. బర్మాను వదిలి రాజమండ్రిలో స్థిరపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలీ తండ్రి విషయానికొస్తే.. అబ్దుల్ సుభాన్. ఈయన దర్జీగా పనిచేసేవారు. తల్లి జైతున్ బీబీ గృహిణి. చిన్నప్పటినుంచి చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో నటన పైన ఆసక్తి పెంచుకున్న ఈయన.. శ్రీపాదాజీత్ మోహన్ మిత్ర బృందంలో మిమిక్రీ కళాకారుడిగా, డాన్సర్ గా ప్రదర్శనలు ఇచ్చేవారు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మ వీధిలో చిన్న పాకలో ఉండేవారట. ఆ తర్వాత అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారినట్లు సమాచారం.
ALSO READ:HBD Rajamouli: సినీ పరిశ్రమనే శాసించిన జక్కన్న.. రెమ్యూనరేషన్, ఆస్తులు, కార్ల జాబితా ఇదే!
రాజమండ్రిలో ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ సినిమా షూటింగ్ సమయంలో అక్కడ చిత్ర బృందానికి కామెడీ పంచడానికి వచ్చిన ఆలీని చూసి దర్శకుడు కే విశ్వనాథ్ (K.Viswanath) ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి, దేవుడు మామయ్య ఇలా పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ’సీతాకోకచిలుక’ సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుకొని నేటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అలీ తన సినీ కెరియర్లో దాదాపు 1100 కు పైగా చిత్రాలలో నటించారు.
అలీ చైల్డ్ ఆర్టిస్ట్, నటుడు మాత్రమే కాదు గొప్ప మనసున్న వ్యక్తి కూడా.. తన తండ్రి పేరు మీదుగా “మహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్” అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. ఈయనకు అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు గౌరవ డాక్టరేట్ ను కూడా ప్రకటించారు. ఈయన తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలీకి నంది పురస్కారాలతో పాటు పలు ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.