Mumbai Boat Capsize| ముంబై నగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో ప్రయాణికులతో నిండుగా వెళుతున్న ఒక ఫెర్రీ పడవను వేగంగా వచ్చి ఒక నేవీ బోటు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. వారిలో ముగ్గురు నావికా దళానికి చెందినవారున్నారు.
గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఫెర్రీ బోటులో ముంబై నగరం సమీపంలో ఉన్న ఎలిఫెంటా ఐల్యాండ్ కు ప్రతిరోజు ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం డిసెంబర్ 18, 2024న కూడా ‘నీల్ కమల్’ అనే ఫెర్రీబోటులో 112 మంది ప్రయాణికులు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ఐల్యాండ్ కు సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఇండియన్ నేవీకి (భారత నౌక దళం) చెందిన ఒక స్పీడ్ బోటు మోటార్ ట్రయల్స్ చేస్తోంది. ఆ ట్రయల్స్ కోసం నేవీ స్పీడ్ బోట్ లో మొత్తం అయిదు మంది ఉన్నారు. వారిలో ఇద్దరు మోటార్ తయారీ కంపెనీకి చెందినవారున్నారు.
ఈ క్రమంలో నేవీ స్పీడు బోటు అదుపు తప్పి వేగంగా వెళ్లి నీల్ కమల్ ఫెర్రీ బోటును ఢీ కొట్టింది. దీంతో రెండు పడవలు నీటిలో బోల్తాపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు రెండు గంటల తరువాత చూస్తే.. నేవి బోటులో ఉన్న అయిదుగురిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన మిగతా ముగ్గురిలో బోటు ఇంజిన్ తయారీ కంపెనీ ఉద్యోగులు ఇద్దరు కాగా.. ఒకరు నేవీకి చెందినవారు. మరోవైపు ఫెర్రీబోటులోని 112 మందిలో 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ 11 నేవీ బోట్లు, 3 మెరైన్ బోట్లు, ఒక కోస్ట్ గార్డ్ బోటుతో సహాయక చర్యటు చేపట్టారు. నాలుగు హెలికాప్టర్లు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్కూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అధికారులతో పాటు నీట మునిగిన వారిని కాపాడేందుకు సమీప ప్రాంతంలోని మత్సకారులు, నెహ్రూ పోర్ట్ అథారిటీ వర్కర్లు సముద్రంలోకి దిగారు.
ప్రమాదంలో 13 మంది చనిపోయారని స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. చనిపోయిన 13 మంది కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషాద ఘటన గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసి.. చనిపోయిన వారి పట్ల సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు.
ముంబైలోని కొలాబా ప్రాంత పోలీసులు ఈ ఘటన ఎలాజరిగిందనే అంశంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేవీ అధికారులను కూడా విచారణ చేస్తామని తెలిపారు.