Big Stories

Nanded Govt Hospital : “మహా” మృత్యుఘోష.. ఆసుపత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య

- Advertisement -

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారానికి 24 మంది మరణించగా..48 గంటల్లో మృతుల సంఖ్య 31కి పెరగడం అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మృతుల్లో 16 మంది శిశువులు ఉండగా..మిగిలినవారంతా పెద్దవారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

- Advertisement -

నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో 31 మంది చనిపోగా.. వారిలో 16 మంది శిశువులు ఉన్నారని.. వారంతా వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చినట్లుగా వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. ఈ విషాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి మంగళవారం మధ్యాహ్నానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే మృతుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్‌ చెబుతున్నారు.ఇంతకు ముందు ఆసుపత్రిలో పనిచేసే కొందరు సిబ్బందిని బదిలీ చేయటం వల్ల రోగులకు సేవలందించటంలో ఇబ్బందులను ఎదురవుతున్నట్లు డీన్ పేర్కొన్నారు. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో పదుల సంఖ్యలో పేషంట్లు గంటల వ్యవధిలో చనిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మందుల కొరతతో పేషంట్లు చనిపోవడం బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పదుల సంఖ్యలో పేషంట్లు చనిపోవడానికి బీజేపీనే కారణమని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం..తన పబ్లిసిటీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ.. పిల్లలకు మందులకు డబ్బులు లేవా అంటూ ప్రశ్నించారు. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిలో శిశువులతో పాటు గర్భిణులు కూడా ఉన్నారన్నారు. మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కొందరు పేషంట్లు గుర్తు తెలియని విషం కారణంగా మరణించినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా.. 500 బెడ్లు ఉన్న నాందేడ్ ఆసుపత్రిలో 1200 మంది రోగులు ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అశోక్ చవాన్ డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రెసిడెంట్ రాజ్ థాక్రే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. 48 గంటల్లో ఆసుపత్రిలో 31 మంది పేషంట్లు చనిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో నాందేడ్, థానే, ముంబై లలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో టీబీ మందులు దొరకక రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. పేషంట్లకు మందుల కొరత లేకుండా చూసుకోలేని ఈ ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉందని ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News