Biggest drug bust In India(Telugu breaking news): నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), భారత నావికా దళం, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సహాయంతో గుజరాత్ తీరంలో అనుమానిత పాకిస్థాన్ సిబ్బంది నడుపుతున్న పడవ నుంచి 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత ఉపఖండంలో ఇదే అతిపెద్ద మాదక ద్రవ్యాల స్వాధీనం.
ఈ మాదక ద్రవ్యాల అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలపై “ప్రొడ్యూస్ ఆఫ్ పాకిస్థాన్” అని రాసి ఉంది. ఇందులో 3,089 కిలోల గంజాయి, 158 కిలోల మెథాంఫెటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నాయి.
పడవలో దర్యాప్తు అనంతరం, అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని కనుగొన్నారు. దీంతో ఐదుగురు సిబ్బందిని అరెస్టు చేశారు. బోట్, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Read More: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ హవా.. క్రాస్ ఓటింగ్‌తో ఖంగుతిన్న ప్రతిపక్షాలు..
స్వాధీనం చేసుకున్న బోట్, డ్రగ్స్, సిబ్బందిని గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలించారు.
అనుమానిత పాకిస్థానీ సిబ్బందిపై మరింత సమాచారం సేకరించేందుకు, మాదక ద్రవ్యాల మూలం, గమ్యాన్ని కనుగొనడానికి దర్యాప్తు జరుగుతోంది.
ఈ ఆపరేషన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన “డ్రగ్ రహిత భారత్” దార్శనికతను అనుసరించినందుకు ఎన్సీబీ, ఏటీఎస్, ఇండియన్ నేవీని అభినందించారు.