Spurious liquor Deaths | కల్తీ మద్యం తాగడం వల్ల ఏడుగురు వ్యక్తులు మరణించారని బీహార్ పోలీసులు ఆదివారం జనవరి 19, 2025న తెలిపారు. అయితే ఈ మరణాలన్నీ గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్నాయని సమాచారం. బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది.
వెస్ట్ చంపారన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) శౌర్య సుమన్ కల్తీ మద్యం మరణాలపై మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారంతా వెస్ట్ చంపారన్ జిల్లా లౌరియా పోలీస్ స్టేషణ్ పరిధి ప్రాంతాలకు చెందినవారిని ఆయన తెలిపారు. స్థానికులు ఈ మరణాల వెనుక కల్తీ మద్యం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఎస్‌పి శౌర్య సుమన్ వెల్లడించారు. అయితే చనిపోయిన ఏడుగురిలో చివరగా మరణించిన ఇద్దరు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
“ఇప్పటివరకు కల్తీ మద్యం అనుమానిత మరణాల సంఖ్య 7 కుచేరుకుంది. కానీ విచారణ చేయగా.. చివరగా చనిపోయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు ట్రాక్టర్ ప్రమాదం కారణంగా.. మరొకరు పక్షవాతానికి గురై చనిపోయారు. కానీ వీరిద్దరు కూడా ఇటీవలే మద్యం సేవించి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.” అని ఎస్‌పి శౌర్య సుమన్ చెప్పారు.
జనవరి 15 నుంచి వరుస మరణాలు
కల్తీ మద్యం అనుమానిత మరణాల గురించి అధికారులకు జనవరి 19నే తెలిసినా.. మొదటి వ్యక్తి జనవరి 15నే చనిపోయాడని విచారణలో తేలింది. ఏడుగురు వ్యక్తుల మద్యం తాగడం వల్లే అనుమాస్పదంగా చనిపోయారని పోలీసులకు సమాచారం అందే లోపే ఆ ఏడుగురి అంతక్రియలు జరిగిపోవడంతో అధికారులకు విచారణలకు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఎస్‌పి శౌర్య సుమన్ ప్రకారం.. చివరి రెండు మరణాల గురించి సమాచారం లభించింది. కానీ మితగా అయిదుగురు చనిపోవడానికి స్పష్టమైన కారణాలు పూర్తిగా తెలియలేదు. అందుకే ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఒక బృందాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read: కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం!
వెస్ట్ చంపారన్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ సుమీత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “చనిపోయిన వారి మృతదేహాలు ఎక్కడ పూడ్చి పెట్టారో ఇంతవరకు సమాచారం అందలేదు. పైగా కొందరి మృతదేహాలను దహనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా విచారణ చేయడం చాలా కష్టమైన పని. గత కొన్ని రోజులుగా లౌరియా ప్రాంతంలో జరిగిన మరణాలపై 24 గంట్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. కానీ వివరాలు సేకరించడమే చాలా క్లిష్టంగా మారింది” అని చెప్పారు.
మృతులలో ఒకరైన మనీష్ సోదరుడు ప్రదీప్ మాట్లాడుతూ.. తన సోదరుడు అతని స్నేహితుడు కలిసి కొన్ని రోజుల క్రితం మద్యం సేవించారని.. ఆ వెంటనే అనారోగ్యం పాలై మరుసటి రోజు మరణించాడని తెలిపారు. వారిద్దరి మరణాలకు ఆ కల్తీ మద్యమే కారణమని ఆరోపించాడు.
బిహార్ రాష్ట్రంలో 2016 నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్య పాన నిషేధం విధించారు. మద్య విక్రయించడంపై కూడా బిహార్ లో నిషేధం ఉంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది కల్తీ మద్యం తాగి చనిపోతూనే ఉన్నారు.