Uttarakhand Chamoli: ఇటివల తెలంగాణలో SLBC టన్నెల్లో 8 మంది మరణించిన ఘటన మరువక ముందే, తాజాగా అలాంటిదే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో జరిగిన ఓ దుర్ఘటనలో కూడా 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఫిబ్రవరి 28న చమోలిలోని మానా గ్రామంలో చోటు చేసుకుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు మోలి-బద్రీనాథ్ ప్రాంతంలోని ఓ కంటైనర్ హౌస్‌లో బస చేస్తుండగా ఓ పెద్ద హిమపాతం వారిపై జారిపడింది.
ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందిస్తూ సహాయక చర్యలకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు కంటైనర్ హౌస్‌లో ఉన్నారు. కానీ పెద్ద మంచు పర్వతం జారిపడడంతో వారు అందులోనే చిక్కుకున్నారు.
ఈరోజు హిమపాతం సంభవించిన మూడో రోజు తప్పిపోయిన నలుగురు కార్మికుల కోసం వెతకడానికి ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో వైమానిక దళం, ఇతర భద్రతా దళాలు కీలక పాత్ర పోషించాయి. సహాయక చర్యల కోసం ఎంఐ 17 హెలికాప్టర్, మూడు చీతా హెలికాప్టర్లు, రెండు రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్లను మోహరించారు. గాయపడిన వారికి చికిత్స కోసం ఎయిమ్స్ రిషికేశ్ నుంచి ఎయిర్ అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, బాధితులను గుర్తించే కెమెరాలు, రోటరీ రెస్క్యూ రంపాలు, హిమపాతం రాడ్లు, డాగ్ స్క్వాడ్‌ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించారు. ఈ క్రమంలో NDRF, SDRF, ఆర్మీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సహాయక చర్యలను పూర్తి చేశారు.
Read Also: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. రూ.5కే కరెంట్ కనెక్షన్..
ఈ క్రమంలో ఆదివారం నాటికి హిమపాతంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మరణించారు. వారిలో నలుగురు రక్షించిన తర్వాత చికిత్స సమయంలో మరణించగా, ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం 46 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన రెండో రోజు శుక్రవారం 17 మందిని రక్షించగా, శనివారం 33 మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే చిక్కుకున్న కార్మికుల సంఖ్య 55 కాగా, ఒక కార్మికుడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శిబిరం నుంచి తన గ్రామానికి బయలుదేరాడని తెలుస్తోంది.
మృతదేహాలను వెలికితీసిన తర్వాత వారిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. 44 మంది కార్మికులను జ్యోతిర్మఠ్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులు ఎయిమ్స్ రిషికేశ్‌లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మెరుగుపడుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో వాతావరణం మరింత తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా కొండ ప్రాంతాలలో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.