Farmers: రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో 5 రూపాయలకే రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. ఈ పథకం మొదటగా మధ్యప్రదేశ్‌లోని మధ్య ప్రాంతంలో అమలు చేస్తామని, ఆ తరువాత దీనిని పశ్చిమ ప్రాంతంలో విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు.
దీంతోపాటు ఈ బడ్జెట్‌లో సోలార్ పంపుల ఏర్పాటు చేసి రైతులను విద్యుత్ ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే మూడేళ్లలో 30 లక్షల సోలార్ పంపులు పంపిణీ చేస్తామన్నారు. ఈ క్రమంలో సౌరశక్తిని ఎక్కువగా ఉత్పత్తి చేసే రైతుల నుంచి ప్రభుత్వం విద్యుత్తును కూడా కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు.
గతంలో గ్రామాల్లో విద్యుత్తు, సరైన రోడ్లు ఉండేవి కావన్నారు సీఎం. రైతులు వైర్లు పట్టుకున్నా కూడా విద్యుత్ వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. నగరాలకు తాగునీరు, పొలాలకు నీరు, పరిశ్రమలకు నీరు అందించవచ్చు. కానీ ఉజ్జయినిలోని సింహస్థకు నర్మదా నీటిని అడిగినప్పుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ అసెంబ్లీలో అసాధ్యమని అన్నారని ప్రస్తావించారు. శిప్రా ఎక్కువ ఎత్తులో ఉందని, నర్మద క్రిందకు ఉంది కాబట్టి కుదరదన్నారు.
Read Also: Blue Ghost: చంద్రునిపై బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ సక్సెస్.. రికార్డ్ సృష్టించారు తెలుసా..
కానీ ప్రస్తుతం మాత్రం నర్మద – శిప్రా నదులను లింక్ చేశామని సీఎం అన్నారు. కెన్ – బెట్వా నదులను అనుసంధానించడం ద్వారా, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లకు చాలా రోజుల నుంచి నీరు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ గత కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని అసాధ్యమని చెప్పారని గుర్తు చేశారు. తర్వాత వారు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని. కానీ మేము ఈ అసాధ్యమైన పనిని ఇప్పుడు చేసి చూపించామన్నారు.
చంబల్ ప్రాంత ప్రజలు కొన్నిసార్లు తుపాకులు కూడా పట్టుకునేవారని పేర్కొన్నారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు మారిందన్నారు సీఎం. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు నీరు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో పార్వతి-కలిసింధ్-చంబల్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా చంబల్-మాల్వాలోని అనేక జిల్లాలు మారుతున్నారు. మధ్యప్రదేశ్‌లో క్వింటాలుకు రూ. 2600 చొప్పున గోధుమలను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గోధుమలపై క్వింటాలుకు రూ. 175 చొప్పున బోనస్ అందిస్తుందన్నారు.
అదే సమయంలో వరిపై పంట ఉత్పత్తి చేసే రైతులకు హెక్టారుకు రూ. 4,000 అదనంగా అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో రైతులు ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్‌కు పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి నాగలి, ఎడ్ల బండి, గోధుమ కంకులు వంటివి బహూకరించారు.