AAP Budget : దిల్లీలో ప్రచారం ఉచితాల వరదపై సాగిపోతుంది. రోజురోజుకు నాయకులు ఇచ్చే ఉచిత హామీలతో దిల్లీ రాజకీయాలు గాడితప్పుతున్నాయా అనే ఆలోచనలో పడేస్తున్నాయి. ఓ పరిమితి వరకు ఉచితాలను అంగీకరించే జనానికి తాము అధికారంలోకి వస్తే ఏకంగా నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేలు పొదుపు అయ్యేలా పథకాలు అమలు చేస్తామంటూ కేజ్రివాల్ ప్రకటించారు. దీంతో.. అవినీతి నిర్మూలన అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పుడు రోజుకొక ఉచిత ప్రకటనలతో కేజ్రివాల్ ప్రచారం చేస్తున్నారు. కేజ్రీ తీరు చూసి.. దిల్లీలో నెలకు సగటున రూ.35 వేల సేవింగ్స్ ఎలా సాధ్యం కేజ్రీ అంటూ ప్రశ్నిస్తున్నారు దిల్లీవాసులు, నెటిజన్లు.
కేజ్రీవాల్ తన X ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. తాను చాందినీ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఓ కుటుంబాన్ని కలిశానని తెలిపిన కేజ్రీవాల్.. వాళ్లకు ఆప్ సేవింగ్స్ సర్టిఫికేట్ అందజేసినట్లు తెలిపారు. వాళ్లతో కాసేపు కూర్చుని ఆ కుటుంబం నెలవారీ పొదువు గురించి చర్చించానని, వారు నెలకు రూ.50,200 ఆదా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కానీ.. అదే ఆద్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే దిల్లీలోని ప్రతీ కుటుంబం నెలకు రూ.25,000 – రూ. 50,000 వేల ఆదా సాధ్యమవుతుంది అంటూ తెలిపారు. అందుకే.. దిల్లీ ప్రజలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దని, బీజేపీకి ఓటు వేయవద్దని కోరారు.
దిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాల ప్రచారంలో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. బడ్జెట్ పత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి దిల్లీ కుటుంబానికి నెలవారీ రూ. 25,000 లబ్దిని అందజేస్తాయని, కొత్తగా జోడించే పథకాలతో మరో రూ.10,000 పొదుపు సాధ్యమవుతుందని అన్నారు. మొత్తంగా.. ప్రతీ కుటుంబం నెలకు రూ.35 వేల పొదుపు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో.. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో విస్త్రతంగా చర్చలు నడుస్తున్నాయి.
మామూలుగా బడ్జెట్లు ద్రవ్యోల్బణాన్ని తీసుకువస్తాయని, ఫలితంగా.. ఇంటి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న కేజ్రీవాల్.. ఆప్ పార్టీ అందించే పథకాలతో వారి బడ్జెట్, నెలవారీ ఖర్చులు ఎలా ప్రభావితం అవుతాయో విశ్లేషించుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మి పార్టీ ప్రకటించిన పథకాలతో దిల్లీలోని కుటుంబాలకు నెలకు రూ.25 వేలు ఆదా అవుతుండగా, రాబోయే పథకాలు మరో రూ.10 వేలు అదనంగా పొదుపు ఖాతాలోకి చేరతాయంటూ భారీ ప్రకటన చేశారు. ఈ పథకాల గురించి చర్చించి.. ఓటర్లు ఆలోచించుకోవాలి అని సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే, ఈ ప్రయోజనాలను కోల్పోవడంతో పాటు అంతమేర నెలవారీ భారం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.
తన మాటల్ని సమర్థించుకుంటూ.. దిల్లీలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం ద్వారా నెలకు రూ.4,000-రూ.5,000, ఉచిత మంచి నీరు ద్వారా రూ.2,500, ఉచిత బస్సు ప్రయాణం రూ.2,500, ఉచిత విద్య రూ.10,000, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రుల ద్వారా మరో రూ.5,000 ప్రయోజనాన్ని అందిస్తున్నాయని అన్నారు. అదే సందర్భంలో.. ఓటర్లు బీజేపీ కి ఓటు వేస్తే ఆప్ పథకాల్ని నిలిపివేస్తారంటూ హెచ్చరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నూతన పథకాలు..
ఎన్నికల ప్రచారంలో దిల్లీలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ఆవిష్కరించారు. ఈ ప్రయోజనాల ద్వారా అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపిన కేజ్రీవాల్.. వీటిలో మహిళలకు రూ.2,100, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని చేర్చారు. వాటితో పాటు దిల్లీలోని సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య చికిత్స వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా నెలవారీ పొదుపులో రూ.8,000-రూ.10,000 అదనంగా చేరతాయంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.
దాంతో పాటే.. దిల్లీలోని అన్ని నగరాల్లో ఆప్ ‘బచత్ పాత్ర’ను ప్రారంభించారు. ఈ విధానంలో ఆప్ కార్యకర్తలు అందరు ఓటర్ల ఇళ్లను సందర్శిస్తారు. పార్టీ పాలన నుంచి వారు పొందనున్న ఆర్థిక ప్రయోజనాల వరకు అన్నింటినీ వివరించనున్నారు.