Modi and Pawan : మెస్ట్ ఇంట్రెస్టింగ్ మీటింగ్. ఎన్నాళ్లుగానో వేచియున్న సమావేశం. ప్రధాని మోదీతో జనసేనాని పవన్ చర్చ. హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ పాలిటిక్స్ కీలక టర్న్ తీసుకోనున్నాయా? బీజేపీతో స్నేహానికి బీటలు వారుతున్న వేళ.. ఆ ఇద్దరి కలయికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. వాళ్లు లోన ఏం మాట్లాడుకుంటారనేది తరువాతి విషయం. ముందు వాళ్లిద్దరూ కలుస్తున్నారనే న్యూస్ చాలు ఏపీ రాజకీయాలను వేడెక్కించడానికి.
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీతో జనసేనకు అంతమంచి సంబంధాలేమీ లేవు. అఫిషియల్ గా పొత్తు ఉన్నా.. ప్రాక్టికల్ గా ఎవరి రాజకీయం వారిదే. జగన్ పై జనసేనాని ఆవేశంతో ఊగిపోతుంటే.. కమలనాథులు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయి వైసీపీకి పరోక్షంగా మేలు చేస్తున్నారనే అనుమానం. ఇదే మంచి సమయంగా.. జనసేన వైపు ఆశగా చూస్తోంది టీడీపీ. బీజేపీకి సైతం స్నేహహస్తం చాచేందుకు చంద్రబాబు ఉత్సాహం కనబరుస్తున్నారని అంటున్నారు. పవన్ కు కూడా బాబుతో చేతులు కలిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేనట్టుంది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ ఇప్పటికే స్పష్టం చేశారు పవన్. అంటే, టీడీపీతో పెత్తు ఉంటుందనేగా.
ఈ పొలిటికల్ ఈక్వేషన్ లో ప్రధానమైన చిక్కుముడి ఒకటుంది. ఇటు, బీజేపీ జనసేన బంధం అంతఈజీగా వీడేది కాదు. అటు, జగన్ ను దెబ్బకొట్టాలంటే టీడీపీ జనసేనల పొత్తు అత్యంత ఆవశ్యకం. అంటే, ట్రయాంగిల్ ఫ్రెండ్ షిప్ తప్పనిసరి. ఇక్కడే చిక్కొచ్చిపడింది. టీడీపీతో స్నేహానికి బీజేపీ ససేమిరా అంటోంది. అందుకు కారణం వైసీపీతో పరోక్ష బంధమే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్నివిషయాల్లో మద్దతుగా నిలుస్తోంది. వైసీపీ సైతం అన్ని కేంద్ర బిల్లులకు అనుకూలంగా ఓటేస్తోంది. ఆ రెండు పార్టీలకు ఒకరి అవసరం ఇంకొకరికి ఉన్నట్టుంది. అందుకే, టీడీపీతో సై అనేందుకు కమలనాథులు వెనకడుగు వేస్తున్నారు. పవన్ మాత్రం సైకిల్ కలిసొస్తే విజయయాత్ర సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇదే చిక్కుముడగా మారింది. మోదీ, పవన్ భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావనకు రావొచ్చు.
ఏపీ బీజేపీ, జనసేనల మధ్య ఉన్న గ్యాప్ ని మోదీ ఫిల్ చేసే అవకాశం ఉంది. గతంలోనూ బీజేపీ జాతీయ నాయకులపై ఉన్న నమ్మకాన్ని బహిరంగంగానే ప్రదర్శించారు పవన్. ఢిల్లీ బీజేపీ సైతం పవన్ పై విపరీతమైన ప్రేమ చూపిస్తోంది. రాష్ట్ర పార్టీతోనే అసలు సమస్యంతా. అలాంటిది నేరుగా మోదీనే జనసేనానితో జై కొడితే.. ఇక స్థానిక నాయకులు చేసేదేమీ ఉండదు. బీజేపీ ఇస్తానన్న రోడ్ మ్యాప్.. ఇక హస్తిన నుంచే వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇక, బీజేపీ-జనసేన-టీడీపీ కూటమిపైనా మోదీ, పవన్ ల మధ్య చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. బీజేపీనేమో వైసీపీకి అనుకూలంగా ఉంది. పవనేమో వైసీపీ అంటే ఒంటికాలిపై లేస్తున్నారు. మధ్యలో టీడీపీ. జగన్ నుంచి బీజేపీని దూరం చేయడం.. అదే సమయంలో బీజేపీకి టీడీపీపై సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేయడం.. అంత ఈజీగా జరిగే పని మాత్రం కాకపోవచ్చు. కానీ, ఆ టఫ్ టాస్క్ ను పవన్ తనదైన స్టైల్ లో డీల్ చేస్తారా? మోదీని మెప్పించి ఒప్పిస్తారా? అందుకే, విశాఖలో మోదీ-పవన్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం.