పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? ముష్కరులకు ధీటైన జవాబు ఇచ్చేదెలా..? అసలు కాశ్మీర్ నుంచి వారిని ఏరివేయడం సాధ్యమేనా..? ఇలాంటి ప్రశ్నల మధ్య కార్యసాధకుడిగా మనకు కనిపిస్తున్న ఏకైక వ్యక్తి, శక్తి అజిత్ దోవల్. అవును, దాడి జరిగిన సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, నేరుగా ఢిల్లీకి తిరిగి వచ్చి అజిత్ దోవల్ తోనే భేటీ అయ్యారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారు. అంతగా మోదీ నమ్మకం చూరగొన్న అజిత్ దోవల్ ఈ సమస్యకు పరిష్కారం చూపగలరా..?
ఎవరీ అజిత్ దోవల్..?
ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మన దేశానికి సేవలందిస్తున్నారు. భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తినా, విదేశాలతో శతృత్వం మొదలైనా, యుద్ధ మేఘాలు కమ్ముకున్నా.. వెంటనే అజిత్ దోవల్ రంగంలోకి దిగుతారు. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి భారత్ కి మేలు చేస్తారు. అందుకే ఆయన భారత్ కి అంత స్పెషల్ గా మారారు. అందుకే ప్రధాని మోదీ.. భారత్ కి వచ్చీ రాగానే అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఇదీ ట్రాక్ రికార్డ్..
1968 కేరళ కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. అయినా కూడా ఆయన ఆలోచనలు చాలా చురుకు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా స్థిత ప్రజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాణాపాయం అని తెలిసి కూడా కష్టమైన ఆపరేషన్లకు సైతం ఆయన అప్పట్లో నాయకత్వం వహించేవారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసే ఆయన్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. ఆ పదవికి తగ్గట్టే ఆయన ఇప్పటి వరకు భారత ప్రభుత్వానికి కీలక సలహాలిచ్చారు. విదేశీ దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా, అదే సమయంలో భారత సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించారు.
తొలి విజయం..
1988సో అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో చొరబడ్డ ఖలిస్తాన్ వేర్పాటువాదుల్ని ఏరివేయడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో జరిగిన ఏరివేత కార్యక్రమంలో ఆయన పాత్ర కీలకం. ఐఎస్ఐ ఏజెంట్ గా నటిస్తూ ఆయన స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డారు. వేర్పాటువాదులతో కలసినట్టు నటించి.. వారిని తప్పుదారి పట్టించి చివరకు భారత సైనికుల చేతికి వారు చిక్కేలా వ్యూహ రచన చేసి విజయవంతం అయ్యారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ తర్వాత ఆయనకు కీర్తి చక్ర పురస్కారం లభించింది.
దోవల్ అడుగు పెడితే విజయమే..
1999లో జరిగిన విమాన హైజాకింగ్ విషయంలో కూడా అజిత్ దోవల్ దౌత్య నైపుణ్యాలతో ప్రయాణికుల్ని కాపాడారు. కాందహార్ హైజాకింగ్ లో ప్రాణ నష్టం జరగకుండా నివారించారు. 2014లో ఇరాక్ లోని తిక్రిత్ లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను తరలించడంలో దోవల్ చురుకైన పాత్ర పోషించారు. మయన్మార్ లో ఉగ్రదాడులు, మణిపూర్ దాడుల విషయంలో కూడా ఆయన వ్యూహాలు విజయవంతం అయ్యాయి. 2016లో ఉరి దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ని పర్యవేక్షించింది కూడా అజిత్ దోవలే. భారతదేశ ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆయన పునర్నిర్వచించారు. 2019 బాలాకోట్ వైమానిక దాడి సందర్భంలో అభినందన్ వర్థమాన్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాకిస్తాన్ లో చిక్కుకునిపోగా.. దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి అతడిని విడిపించారు అజిత్ దోవల్. ఆయన సుదీర్ఘ కెరీర్ లో చాలా విజయాలను అందుకున్నారు. కొన్నిసార్లు కీలక ఆపరేషన్లు చేపట్టి శత్రుమూకను అంతమొందించేవారు. అవసరం లేదనుకుంటే, దౌత్యపరమైన చాకచక్యంతో భారత్ కు మేలు చేసేవారు.
తాజాగా మరోసారి అజిత్ దోవల్ సేవల్ని భారత్ సమర్థంగా వినియోగించుకోవాలనుకుంటోంది. దాదాపు రెండున్నర గంటల సేపు అజిత్ దోవల్ సహా రక్షణ మంత్రితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టాలి, కాశ్మీర్ లో తిరిగి శాంతిభద్రతలను ఎలా నెలకొల్పాలనే విషయంపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. మరి అజిత్ వ్యూహం ఏంటి..? దాన్ని ఎప్పుడు, ఎలా అమలు చేస్తారు..? కాశ్మీరీ ప్రజలకు, పర్యాటకులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది..? వీటన్నిటికీ మరికొన్ని రోజుల్లో జవాబులు తెలుస్తాయి.