Ahmedabad Flight Crash : మే డే. మే డే. ఘోరం. విషాదం. దారుణ ప్రమాదం. గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కూలి వందలాది మంది చనిపోయారు. మృతదేహాలు మాంసం ముద్దలుగా మారాయి. తీవ్రంగా కాలిపోయాయి. శరీర ఆనవాళ్లు లేకుండా పోయాయి. విమానంలో 242 మంది ఉండగా వాళ్లు బతికే ఛాన్సెస్ తక్కువే. 169 ఇండియన్స్‌తో పాటు 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరులు ఉన్నారు. స్థానిక మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై ఫ్లైట్ కూలడంతో 20 మందికి పైగా వైద్యులు మరణించారు. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు అంటుకోవడంతో.. ఫైర్ సిబ్బంది వాటిని వెంటనే అదుపులోకి తెచ్చారు. 90 మందితో కూడిన 3 NDRF టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. విమానం కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
అహ్మదాబాద్ విమానాశ్రయంను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. పైలట్, కోపైలట్‌కు సుదీర్ఘ ఫ్లైయింగ్ అవర్స్ అనుభవం ఉండగా.. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. టేకాఫ్ అయిన కాసేపటికే మే డే కాల్ రావడం.. వెంటనే కూలిపోవడం జరిగిపోయింది. మధ్యాహ్నం 1.39 గంటలకు ప్రమాదం జరిగింది. ఫ్లయిట్ క్రాష్ కావడంపై ఏఏఐబీ దర్యాప్తు చేపట్టింది. ఎమర్జెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
మోదీ, షా, నాయుడు అలర్ట్
విమాన ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఇటీవల కాలంలో ఇంతటి పెను విషాదం చూసి ఉండదు మన దేశం. ఘటనపై ప్రముఖులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఫ్లయిట్ క్రాష్ కావడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ అలర్ట్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని చర్యలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు వివరాలు తనకు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లారు షా. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. కానీ, ఒక్కరి ట్వీట్ మాత్రం చాలా తేడాగా ఉంది. ఆయనే బీజేపీ రెబెల్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి.
మోదీ రాజీనామాకు స్వామి డిమాండ్
1950లలో రైల్వేలు పట్టాలు తప్పినప్పుడు అప్పటి ఆ శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదే నైతికతతో.. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే.. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ మరియు అతని సహచరులు ఇప్పటివరకు చేస్తున్నది కేవలం మోసమేనని.. దీనిని ఆపాలని అన్నారు స్వామి. ఆ ట్వీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఎలాంటి టైమ్‌లో ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు సామీ.. ఇలాంటప్పుడు కూడా రాజకీయాలా? అంటూ నెటిజన్లు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
When a train derailed in 1950s, Lal Bahadur Shashtri resigned. On the same morality I demand PM Modi, HM Amit Shah and Civil Aviation Naidu resign so that a free& fair inquiry is held. All that Modi and associates have been doing so far is galavanting which must stop must stop.
— Subramanian Swamy (@Swamy39) June 12, 2025