స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే ఇది ఓ చీకటి అధ్యాయం. ఇప్పటి వరకు లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల గురించి విన్నాం, చదివాం, చూశాం. న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి చీడపురుగులు అక్కడక్కడా ఉంటాయని తెలుసు, అప్పుడప్పుడూ కొందరి బండారాలు బయటపడ్డాయి కూడా. కానీ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పార్లమెంట్ కూడా తీవ్రంగా స్పందించింది. అఖిలపక్ష సమావేశానికి ఉపరాష్ట్రపతి జస్టిస్ జగదీప్ ధన్కడ్ పిలుపునివ్వడం విశేషం.
ఇది చాలా క్లిష్టమైన తీవ్రమైన అంశం అని అంటున్నారు ఉపరాష్ట్రపతి ధన్కడ్. దీనిపై రాజ్యసభ పక్ష నేత, ప్రతిపక్ష నేతతో చర్చించానన్నారు. వారి సూచనల మేరకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని సుప్రీంకోర్టు కొలీజియం ఏర్పాటు చేయడం విశేషం.
2021నుంచి ఢిల్లీ హైకోర్టులో..
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ 2014 అక్టోబరు 13న అలహాబాద్ హైకోర్టులో అడిషనల్ జస్టిస్ నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1 నుంచి అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021 అక్టోబరు 11 నుంచి ఢిల్లీ హైకోర్టుకి వచ్చారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కంపెనీ అప్పీళ్లను చూసే డివిజన్ బెంచ్ కు ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ వర్మ జడ్జిగా ఉన్నారు.
విచారణ కమిటీ..
మార్చి 14వ తేదీన ఢిల్లీలోని లుట్యెన్స్ ప్రాంతంలో ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ కాలిపోయిన స్థిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్ని తొలుత అగ్నిమాపక శాఖ నిర్థారించలేదు. ఆ తర్వాత అగ్నప్రమాద సమయంలో పోలీసులు తీసిన వీడియోలను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచారు. ఆ నివేదికను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. అయితే సుప్రీంకోర్టు చర్యతో ఈ వ్యవహారం మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు ఆ వీడియోలను, ఫొటోలను తన వెబ్ సైట్ లో పెట్టింది. ఆ తర్వాత ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేశారు.
విధులకు దూరం..
ఆలోపు యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ ఫర్ చేయగా, అక్కడి న్యాయవాదుల సంఘం ఆ బదిలీని తీవ్రంగా ఖండించింది. అలహాబాద్ హైకోర్టు చెత్తబుట్ట కాదని, అలాంటి చెత్తని తమ వద్దకు పంపించవద్దని ఘాటుగా బదులిచ్చింది. దీంతో ఆయన్ను పూర్తిగా విధులనుంచి పక్కనపెట్టారు.
సుప్రీంలో పిల్..
ఇక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు న్యాయవాది మాథ్యూ జె నెడుంపర. మరో ముగ్గురు కూడా ఈ పిల్ లో భాగస్వాములయ్యారు. క్రిమినల్ కేసుల నుంచి జడ్జిలకు రక్షణ కల్పిస్తూ 1991లో ఇచ్చిన తీర్పును కూడా సమీక్షించాలని వారు కోరారు.
మరోవైపు యశ్వంత వర్మ మాత్రం తనకేపాపం తెలియదంటున్నారు. తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఆ గదిలో ఎలాంటి నోట్ల కట్టలు పెట్టలేదని చెబుతున్నారు వర్మ. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ యూపీఐ ద్వారా కానీ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ జరుపుతామని చెప్పారు. త్రిసభ్య కమిటీ విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి.