All Party Meeting in Delhi: బంగ్లాదేశ్, భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు.
బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా ఆందోళనల కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి భారత్‌కు వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఆ దేశంలో అల్లర్లు తగ్గడంతో కర్ఫ్యూ ఎత్తివేశారు. బంగ్లాదేశ్‌లో సైన్యం స్వాధీనం చేసుకోవడంతో భారత్ అలర్ట్ చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ పరిస్థితులపై విదేశాంగ మంత్రి జై శంకర్ వివరించనున్నారు.
షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై వైఖరిని అంచనా వేసేందుకు అఖిలపక్షం భేటీ అయింది. బంగ్లాదేశ్ సంక్షోభం విషయంలో కేంద్రానికి విపక్షం మద్దతు తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని కేంద్రం వివరించింది.
బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది. దీంతోపాటు బంగ్లా, భారత్ సరిహద్దులో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది.
అలాగే, బంగ్లాదేశ్‌లో సైనిక పాలనతో భారత్ అలర్ట్ అయింది. ఆర్మీ యూనిట్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12గంటలకు విద్యార్థి సంఘాల సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో దేశంలో నెలకొన్న అశాంతి, అల్లర్ల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు.
ఢిల్లీలో బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. దీంతో పాటు భారత్, బంగ్లాదేశ్ మధ్య తిరిగే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మైత్రి, బంధన్, మిథానీ రైళ్లను నిలిపివేసింది.. అలాగే బంగ్లాదేశ్ కు వెళ్లే ఎయిరిండియా, ఇండిగో విమానాలను సైతం రద్దు చేసింది.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తుంది. స్టూడెంట్స్ యూనియన్లు 24 గంటలు డెడ్ లైన్ విధించాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా నోబెల్ బహుమతి విజేత మహ్మద్ యూనస్ వ్యవరించనున్నారు. యూనస్ వైపు విద్యార్థి ఉద్యమ నేతలు మొగ్గు చూపుతున్నారు. అయితే షేక్ హసీనా..16గంటలు భారత్‌లోనే ఉండడం విశేషం. బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.