Sheikh Hasina latest news(International news in telugu): బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎక్కడున్నారు? భారత్‌లోనా.. యూకేలోనా .. ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తాజాగా యూకేలో ఉండేందుకు ఆమెకు ఇంకా అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోమవారం బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన మాజీ ప్రధాని షేక్ హసీనా నేరుగా ఇండియాకు చేరుకున్నారు. అక్కడి నుంచి బ్రిటన్‌కు వెళ్తారనే వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు ఆమె భారత్‌లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో యూకే నుంచి ఇప్పటివరకు అనుమతి లభించలేదని ‘డైలీ సన్’ తెలిపింది. ఆమెకు తాత్కాలిక ఆశ్రయం కల్పించిన భారత్.. అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా షేక్ హసీనా గతంలో భారత్‌లో ఆరేళ్లపాటు ఆశ్రయం పొందింది. 1975లో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌తో సహా తన కుటుంబాన్ని బంగ్లాదేశ్‌లో ఊచకోత కోశారు. ఆ సమయంలో హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. షేక్ హసీనా తన భర్త, పిల్లలు, సోదరితో కలిసి 1975 నుండి 1981 వరకు ఆరేళ్లపాటు ఉన్నారు. ఢిల్లీలోని లజ్‌పత్ ప్రాంతంలోని పండారా రోడ్ ఏరియాలో నివసించిన విషయం తెల్సిందే.
ALSO READ: బంగ్లాదేశ్ పరిస్థితిపై భారత్ ఏమనుకుంటోంది?
రాజకీయ శరణార్ధిగా యూకెలో ఉండేందుకు మాజీ ప్రధాని షేక్ హసీనా ఆశ్రయం కోరినట్టు తెలుస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. హసీనా సోదరి రెహానా యూకె పౌరసత్వం ఉంది. ఆమె కూతురు తులిప్ సిద్ధిఖీ ప్రస్తుతం యూకేలో అధికార లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలు. ఈ క్రమంలో హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్టు సమాచారం.
మరోవైపు బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. అల్లర్ల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కోరింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అభిప్రాయపడింది.
మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఆదేశ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు. హసీనా రాజీనామా చేశారని, తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుందన్నారు. ప్రస్తుతం అన్ని బాధ్యతలను ఆర్మీ తీసుకుందని, దయచేసి సహకరించాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.