Amit Shah: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) చుట్టూ వివాదం కొనసాగుతున్న వేళ.. విపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సవాల్ విసిరారు. ఈ అంశంపై పార్లమెంట్ ప్రత్యేక సమవేశాల్లో చర్చకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిపై భయపడటానికి, ఇందులో దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు అమిత్ షా వ్యాఖ్యనించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై విపక్షాలు చేపడుతున్న నిరసనల నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంట్‌లో అర్ధవంతమైన చర్చలు జరిపే ఉద్దేశం విపక్షాలకు ఎంతమాత్రం లేదని, సభను నడవనీయకుండా రభస సృష్టించడమే వారి నైజమని లక్నోలో అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఈ విషయంపై ఎప్పుడూ మాట్లాడరని.. వీధుల్లో మాత్రం హడావుడి చేస్తారని ఎద్దేవా చేశారు.
ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. హర్యానా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాలకు ఇక ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశం లేదనే విషయం అర్థమైపోయిందని అన్నారు. సొంతంగా గెలిచే దమ్ము లేకనే, అంపైర్ లాంటి ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తూ ‘ఓట్ల దొంగతనం’ అని ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనమండలి (గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానాలు) ఎన్నికల ఫలితాలపైనా అమిత్ షా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాలు గెలుచుకోగా, ఎస్పీ 5 స్థానాలను దక్కించుకుంది. తొలుత ఈ ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ ఇది బీజేపీకి చెంపపెట్టు లాంటిదని.. 2027లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది నాంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తాజాగా కొట్టిన అమిత్ షా.. రామామణంలో ‘అంగదుడి పాదం’ ఎంత స్థిరంగా ఉందో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కూడా అంతే బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే యూపీ ఎన్నికల్లో మూడోసారి భారీ మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Also Read: పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి