Begging Ban: ఈ మధ్యకాలంలో వివిధ రాష్ట్రాలు రకరకాల బిల్లులు తెస్తున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. అది ఎంతవరకు సక్సెస్ అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. తాజాగా మిజోరం ప్రభుత్వం యాచకులు లేని రాష్ట్రంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. భిక్షాటనను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మిజోరం యాచక నిషేధ బిల్లు-2025కు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిషేధించడం కాకుండా యాచకులకు పునరావాసం కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం.
మిజోరం అసెంబ్లీ యాచక నిషేధ బిల్లు-2025ను ఆమోదించింది. రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించడంతో పాటు బాధితులకు పునరావాసం, జీవనోపాధిని అందించడం దీని ముఖ్యఉద్దేశం. కొత్త చట్టం ప్రకారం.. ప్రభుత్వం రిలీఫ్ బోర్డును, రిసీవింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. భిక్షాటన చేస్తూ పట్టుబడిన వారిని ఆ కేంద్రంలో తాత్కాలికంగా ఉంచుతుంది.
24 గంటల్లోగా వారి స్వస్థలాలకు పంపిస్తారు. లేకుంటే కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని అక్కడికైనా పంపిస్తారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వ్యవస్థ ఉన్నాయని, చర్చిలు, స్వచ్ఛంద సంస్థల చొరవ వల్ల యాచకుల సంఖ్య తక్కువగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్‌పుయ్ వెల్లడించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కేవలం 30 మందికి పైగా యాచకులు ఉన్నారు.
వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ విషయంలో ఇటీవల ఓ సర్వేలో తేలింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా క్రైస్తవ విశ్వాసాలకు విరుద్ధమని ప్రతిపక్ష నేత లాల్‌చందమ రాల్టే అన్నారు.
ALSO READ: ఆ స్కీమ్ పొడిగింపు.. వారిలో ఆనందం, ఇకపై 50 వేలు
యాచకులకు సహాయం చేస్తున్న చర్చి, సమాజం పాత్రను బలోపేతం చేయాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి లాల్దుహోమా నోరు విప్పారు. యాచకులను శిక్షించడం తమ ఉద్దేశం కాదన్నారు. చర్చిలు, ఎన్జీవోల సహకారంతో రాష్ట్రాన్ని యాచక రహితంగా మార్చడమే లక్ష్యమన్నారు.
సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిజోరం రానున్నారు. సైరంగ్-సిహ్ముయ్ వద్ద కొత్త రైల్వేస్టేషన్ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మిజోరం వెలుపల నుండి యాచకులు వస్తారన్నది ప్రభుత్వం ఓ అంచనా. సరైన చట్టాలు అమలులో ఉంటే రాష్ట్రాన్ని యాచకత్వం నుండి విముక్తి పొందగలమన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.