Mamata Benerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలో అధికారాన్ని కేవలం ఒక వర్గం తన చెప్పుచేతల్లో పెట్టుకుందని.. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఇదే తరహా ఏకఛత్రాదిపత్యం పాలన సాగితే దేశంలో అధ్యక్ష పాలన వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు బెంగాల్ సీఎం. కోల్‌కతాలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిగికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అసలు ప్రజాస్వామ్యమనేదే లేదన్నారు మమత. ఓ వర్గం అధికారాన్ని మొత్తం హస్తగతం చేసుకొని.. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తోందన్నారు. సామాన్య ప్రజల్ని అన్యాయం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభ్యర్ధనలను విని వారి పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కోల్‌కతాలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు సుప్రీం కోర్ట్ ఛీఫ్ జస్టిస్ యుయులలిత్ పాల్గొన్నారు.