Financial Assistance to Women monthly: రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థి పార్టీలు. రాష్ట్రాల్లోనైనా.. జాతీయ స్థాయిలోనైనా ఈ రెండ పార్టీలు రాజకీయ ప్రత్యర్థులే. ఒక పార్టీ ఇచ్చిన హామీని, ఎదుటి పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకు భిన్నమైన చిత్రం కనిపిస్తున్నది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెల నెలా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. సాధారణంగా బీజేపీ ఇలాంటి పథకాలను వ్యతిరేకిస్తుంది, విమర్శిస్తుంది. కానీ, ఇక్కడ బీజేపీ కూడా.. కాంగ్రెస్ విధానాన్ని పాటించింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీనే బీజేపీ కూడా ప్రకటించింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే నెలవారీగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
హర్యానాలో కాంగ్రెస్ బుధవారం ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా ఏడు హామీలను పొందుపరిచింది. ఇందులో మహిళలను సాధికారులు చేసే హామీ కూడా ఉన్నది. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ. 2000 అందిస్తామని ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లను రూ. 500కే అందిస్తామని పేర్కొంది. ఇలా మహిళలకు నెల వారీగా ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు.. హర్యానా, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రకటించింది.
ఇక ఇదే హర్యానా రాష్ట్రంలో బీజేపీ గురువారం సంకల్ప్ పత్ర పేరిట మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సంకల్ప్ పత్రలో మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించే హామీని పేర్కొంది. లడో లక్ష్మీ యోజనా కింద మహిళలు అందరికీ నెలకు రూ. 2,100 ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించింది.
Also Read: Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ 2022 క్యాంపెయినింగ్‌లో ఇందిరా గాంధీ ప్యారీ బెహెనా సుఖ్ సమ్మన్ నిధి యోజనా ప్రకటించింది. ఈ స్కీం కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు రూ. 1,500 నెలకు అందిస్తామని తెలిపింది. ఇదే రీతిలో కర్ణాటకలో గృహ లక్ష్మీ కింద మహిళలకు రూ. 2,000 నెలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని పేర్కొంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ. 2,500 నెలవారీగా అందిస్తామని ప్రకటించింది.
అలాగే, పంజాబ్‌లో ఆప్ పార్టీ ఇలాగే 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ. 1,000 అందిస్తామని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీర్ భండార్ స్కీం కింద టీఎంసీ ప్రభుత్వం రూ. 1,000 నెలకు అందిస్తామని పేర్కొంది. అసోంలో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఏపీలో వైసీపీ, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇలాంటి పథకాలనే ప్రకటించింది.